కేతేపల్లి, జనవరి 6 : మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన జపమాల మాత చర్చిలో ముగ్గురు రాజుల పండుగ (క్రీస్తు సాక్షాత్కార వేడుకలు) గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన క్రైస్తవులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి పండుగను ప్రారంభించారు. రాత్రి ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించే ముగ్గురు రాజుల నాటికను ప్రదర్శించారు. నాటకాన్ని తిలకించేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాటిక ముగిసిన అనంతరం పెద్ద ఎత్తున పటాకులు కాల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. పటాకుల చప్పుళ్లు, విద్యుత్ కాంతులతో చర్చి ఆవరణమంతా వెలిగిపోయింది. వేడుకల్లో రెండో రోజైన శుక్రవారం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు జిల్లా నలుమూలల నుంచి క్రైస్తవ మత గురువులు, మత కన్యలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మతస్తులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా వీరినుద్దేశించి ఏలూరు బిషప్ జయరావు పొలిమెర భక్తులకు ఏసు పుట్టుకకు సంబంధించి ఉపదేశమిచ్చారు. ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఏసుక్రీస్తు ఆచరణలను పాటిస్తూ నిర్మలమైన జీవితం గడపాలని, ప్రతిఒక్కరూ తమకు చేతనైనంత పేదలకు సాయం చేయాలన్నారు. భక్తులకు దివ్యస్త ప్రసాదాన్ని అందించారు. సాయంత్రం సామూహికంగా కొవ్వొత్తులను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చర్చి ఆవరణలో ఏర్పాటైన తిరునాళ్ల వద్ద సందడి ఏర్పడింది. కార్యక్రమంలో చర్చి ఫాదర్ ఫ్రాన్సిస్, చర్చి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.