సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 8 : రాహుల్‌గాంధీ మెప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీ జనాభాను తగ్గించిందని, రాష్ట్రంలో 40లక్షల మంది బీసీలను హత్య చేసిన కాంగ్రెస్ సర్కారుపై హత్య కేసు నమోదు చేయాలని సూర్యాపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, మున్నూరు కాపు సంఘం నాయకుడు పుట్ట కిశోర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో మున్నూరు కాపు, బీసీ సంఘాల నాయకులతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో మున్నూరుకాపులు 25లక్షల మంది ఉంటే.. ప్రస్తుతం 13లక్షల మందిని చూపించడం అన్యాయమన్నారు.
మున్నూరు కాపులు రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతున్నారని, చట్టసభల్లో సీట్లు అడుగుతారని బీసీ కులాలను తగ్గించి చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. 3శాతం ఉన్న ఓసీలు 10శాతానికి పెంచిన ఈ సమగ్ర కులగణన సర్వే తప్పుల తడక అని విమర్శించారు. త్వరలోనే బీసీలు, బీసీ ఉపకులాలు జేఏసీగా ఏర్పడి తమ వాటాపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. రాహుల్‌గాంధీ మెప్పు కోసం తప్పుల తడకగా కుల గణన చేశారు తప్ప.. బీసీలపై ప్రేమతో కాదని అన్నారు. ఈ సర్వే తప్పు అని ప్రభుత్వం ఒప్పుకొని మళ్లీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో సూర్యాపేట నుంచే బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టి రాజ్యాంగబద్ధంగా తమ వాటాను సాధించుకుంటామని అన్నారు.
కొందరు బీసీ నాయకులు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు ఒత్తుతూ బీసీలకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. మున్నూరు కాపు సభ్యత్వాలే 18లక్షలు ఉంటే.. 13లక్షల 60వేల జనాభా ఎలా ఉంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మున్నూరు కాపు కులగణన తామే చేపట్టి వెబ్సైట్లో పెడుతామని, అలాగే ఇతర కులాలు కూడా తమ కులగణన చేసి వెబ్సైట్లో పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం సీనియర్ నాయకులు నల్లకుంట్ల అయోధ్య, డేగల జనార్దన్, దంతాల రాంబాబు, సముద్రాల మనోహర్, గోనె సందీప్, కడియం శ్రీను, గోనె సతీశ్, దంతాల వెంకటేశ్వర్లు, గోనె అశోక్, దంతాల కొండల్
పాల్గొన్నారు.