నల్లగొండ సిటీ, జనవరి 01 : గత సంవత్సరం నల్లగొండ రీజియన్లో 0.04 శాతం యాక్సిడెంట్ రేట్ నమోదైందని, దీనిని తగ్గించి సున్నా శాతానికి తెచ్చేందుకు డ్రైవర్లందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డిఫెన్స్ డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోవ్సవాలను పురస్కరించుకుని గురువారం నల్లగొండ డిపో నందు ఆర్ఎం జానిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్.వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జీరో యాక్సిడెంట్ ఉండే విధంగా ప్రయత్నం చేయాలని డ్రైవర్లందరికీ సూచించారు. వేగం ప్రదానం కాదు.. గమ్యం చేరడం ముఖ్యం కావున గమనించి జేబీఎం డ్రైవర్లు, హెయిర్ బస్ డ్రైవర్లు, మన డ్రైవర్లు సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఏకాగ్రతతో నడిపి ప్రమాదాలను నివారించాలని కోరారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి మాట్లాడుతూ.. యాక్సిడెంట్ జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్లుప్తంగా తెలిపారు. ముఖ్యంగా జేబీఎం డ్రైవర్, ప్రైవేట్ డ్రైవర్స్ నైపుణ్యంతో డ్రైవింగ్ చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదమో వివరించారు. డ్రైవర్లు సరిపడా నిద్ర, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం, సూపర్ వైజర్లు, జేబీఎం సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.