యాదగిరిగుట్ట, జూలై 29 : ఆయుర్వేద డాక్టర్లను గుర్తించి, వారిపై వైద్యారోగ్య శాఖ చేస్తున్న దాడులను నిలిపివేయాలని తెలంగాణ పారంపర్య వైద్య మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాత్రి మహారుషి డిమాండ్ చేశారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని పల్లె సృజన సంస్థ అధినేత పోగుల గణేశ్, ఆయుర్వేద విశ్రాంత అధికారి జకోటియాతో కలిసి ప్రారంభించారు.
రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్రి మహారుషి మాట్లాడుతూ పూర్వం నుంచి ఆయుర్వేద వైద్యులు అనేక ప్రాంతాల్లో మానవతా విలువలతో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. అరుదైన వన మూలికలతో వైద్యం చేస్తూ సమాజహితానికి పాల్పడుతున్నారని తెలిపారు. పోగుల గణేశ్, జకోటియా మాట్లాడుతూ ఆయుర్వేద డాక్టర్లు జీవ వైవిధ్యాన్ని కాపాడే ఔషధ మొక్కలను పెంచుతూ, వాటిని వినియోగించి సంప్రదాయ వైద్యం చేస్తున్నారని పేర్కొన్నారు.
శిబిరంలో 350కి పైగా ఔషధ మొక్కలు, వన మూలికలను ప్రదర్శించారు. వాటి ఔషధ విలువలను వివరించారు. అంతరించిపోతున్న అరుదైన వన మూలికలను పరిరక్షించాలని 105 మొక్కలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. వెయ్యికిపైగా మొక్కలతో ఒక ఆల్బమ్‌ను రూపొందించి మొక్కలు గుర్తింపు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు సింహాచలం లక్ష్మణ్‌స్వామి తెలిపారు.