హాలియా, జనవరి 2 : హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సాగర్ ఎడమ కాల్వ దిగువన ఉన్న ఖాళీ స్థలంలో సోమవారం కాకతీయుల కాలం నాటి పురాతన గంగాదేవి విగ్రహం బయట పడింది. జూనియర్ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రాంతంలో చెత్త పేరుకుపోవడంతో విషపురుగులకు నిలయంగా మారింది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల విజ్ఞప్తి మేరకు వార్డు కౌన్సిలర్ సుధారాణీరాజారమేశ్ జేసీబీ సాయంతో చెత్తను తొలగించి శుభ్రం చేస్తుండగా విగ్రహం కనిపించింది.
విగ్రహాన్ని వెలికితీసి పక్కనున్న ఖాళీ ప్రదేశంలో ఉంచారు. స్థానిక అర్చకులు విగ్రహాన్ని పరిశీలించారు. సదరు విగ్రహం కాకతీయుల కాలం నాటిదని, అది గంగాదేవి విగ్రహం కావచ్చని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమతీపురుషోత్తం, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మా శంకయ్య, మార్కెట్‌కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశం, మాజీ ఎంపీపీ అల్లి నాగమణి పెద్దిరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.