నల్లగొండ, డిసెంబర్ 29 : అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చు నివేదికలను ఎన్నికల వ్యయ పరిశీలకులు సతీశ్ గురుమూర్తి, డీఎం నిమ్జే, సంతోష్ కుమార్ పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎలక్షన్ వ్యయ బృందాలకు సంబంధించిన అధికారులతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చులు, రీ కన్సిలేషన్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల నివేదికలను సతీశ్ గురుమూర్తి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నివేదికలను డీఎం నిమ్జే, నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాల నివేదికలను సంతోశ్ కుమార్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.