నేరేడుచర్ల, మే 17 : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని చింతబండ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో సిబ్బంది, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాల పట్టణానికి చివరన పంట పొలాల మధ్యలో ఉండడం వల్ల ప్రహరీ లేకపోవడంతో పాములు, తేళ్లు, విషపురుగులు తరగతి గదిల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంతేకాకుండా వానాకాలంలో పాఠశాల ఆవరణ మొత్తం బురదమయమై విద్యార్థులు, సిబ్బంది తరగతి గదుల్లోకి వెళ్లలేని పరిస్థితి.
ప్రహరీ లేక పాఠశాలకు రక్షణ లేకపోవడంతో రాత్రి సమయంలో పలువురు అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో, ఎంఆర్సీ భవనం వెనక ఉన్న ఈ ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి రక్షణ కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.