సూర్యాపేటలోని సద్దుల చెరువు సరికొత్తగా మారుతున్నది. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో ఇప్పటికే పచ్చని చెట్లు, వాకింగ్ ట్రాక్, పిల్లల ప్లే గేమ్స్, మిరుమిట్లు గొలిపే లైటింగ్‌తో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. ఇక ప్రజలకు మరింత ఆహ్లాదం పంచేలా బోట్లు రాబోతున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చొరవతో 13 బోట్లను రూ.50 లక్షలతో కొనుగోలు చేసేందుకు టెండర్లు పూర్తయ్యాయి. ఇందులో ఇద్దరు కూర్చునే బోట్లు ఐదు, నలుగురు కూర్చునే సైక్లింగ్ బోట్లు ఐదు, 20, 18 మంది కూర్చునే బోట్లు ఒక్కొక్కటి, ఒక స్పీడ్ బోట్ ఉండనున్నాయి. ఇవి ప్రస్తుతం తయారవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి అందుబాటులోకి రానున్నాయి.
– సూర్యాపేట, మే 15 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, మే 15 (నమస్తే తెలంగాణ) : మినీట్యాంక్‌బండ్‌గా మారిన సద్దుల చెరువు ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు వీలుగా చెరువులో బోటు శికారును ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో రూ.50 లక్షల వ్యయంతో 13 బోట్లు కొనుగోలు చేసేందుకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఇద్దరు కూర్చునే 5 బోట్లు, నాలుగు సీట్లతో 5 సైక్లింగ్ బోట్లు, 20, 18 సీటింగ్ కెపాసిటీతో స్పీడ్ బోట్లు సైతం తయారవుతున్నట్లు అధికారులు తెలిపారు.
మినీ ట్యాండ్బండ్గా సద్దుల చెరువు
ఒకప్పుడు మురుగు నీటితో దుర్వాసన వెదజల్లుతూ… పందులు, పశువులకు నిలయంగా సూర్యాపేట నడిబొడ్డున ఉన్న సద్దుల చెరువు.. నేడు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. సుమారు రూ.21 కోట్లతో మినీట్యాంక్‌బండ్‌గా మారి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతోంది. చెరువు నిండా పరిశుభ్రమైన నీళ్లు, కట్టకు రెండు వైపులా పచ్చని చెట్లు, రాత్రి వేళల్లో మిరుమిట్లు గొలిపే లైటింగ్ వెలుతురుతో ప్రజలను ఆకట్టుకుంటున్నది. సూర్యాపేట పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం, సేదతీరడం చేస్తున్నారు. దాంతో పాటు ప్రస్తుతం చిన్నారులల్లో ఉత్సాహం, ఉల్లాసం నింపేలా ఆటల ప్రాంగణం, బండ్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు.
టెండర్లు పూర్తి
సూర్యాపేటలోని సద్దుల చెరువులో రూ.50 లక్షల వ్యయంతో 13 బోట్లు కొనుగోలు చేసేందుకు టెండర్లు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి. బోట్లు నిలిపేందుకు చెరువుకు రెండు పక్కలా ప్లాట్‌ఫాం కోసం జెట్టీలు ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటు ఇద్దరు కూర్చునే 5 శికారీ బోట్లు, నాలుగు సీట్లతో 5 సైక్లింగ్ బోట్లు, 20 సీటింగ్ కెపాసిటీతో ఒకటి, 18 సీటింగ్‌తో మరోటి, 4సీట్లతో ఒక స్పీడ్ బోట్ కొనుగోలు చేశారు. దాంతో పాటు ప్రతి బోట్లో లైఫ్‌జాకెట్లు, ట్యూబ్‌లు ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా బోట్లను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆవిర్భావ దినోత్సవం నాటికి సిద్ధం
మంత్రి జగదీశ్‌రెడ్డి ఆలోచనల మేరకు 13 బోట్లు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తయింది. వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడంతో ప్రస్తుతం బోట్లు తయారవుతున్నాయి. జూన్ 2 నాటికి బోట్లు సిద్ధమవుతాయి. అదే రోజు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం.
– రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్