ఆత్మకూర్.ఎస్, జూలై 16 : మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ట్యూషన్ ఫీజు, కళాశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందజేసిన నిధులను విద్యార్థులు, కళాశాలకు ఖర్చు చేయకుండా గోల్మాల్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేపట్టినా తప్పను ఒప్పుకోవడంలో కిందిస్థాయి అధికారులు గుట్టు విప్పడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 2016-17లో నెమ్మికల్ కళాశాలకు మౌలిక వసతుల కోసం వివిధ రూపాల్లో సుమారు రూ.4లక్షలు వచ్చినట్లు తెలిసింది.
వాటిని ఖర్చు చేయకుండా నెమ్మికల్ ఏపీజీవీబీ బ్యాంకులో నుంచి ఎస్బీఐ బ్యాంకుకు బదలాయించి కళాశాలకు సంబంధించిన వ్యక్తి పేరున ఆ నిధుల్లో రూ. 3లక్షలు చెక్కు ద్వారా డ్రా చేసినట్లు సమాచారం. డబ్బులు డ్రా చేసిన వ్యక్తి మూడు నెలలకే దొడ్డి దారిన ఫ్యాకల్టీ లెక్చరర్‌గా కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. ఈ నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయం చెప్పడం లేదని విమర్శలొచ్చాయి. ఈ విషయమై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కృష్ణయ్యను వివరణ అడుగగా నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని, మరో వారం రోజుల్లో కారకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.