నీలగిరి, జనవరి 1 : నల్లగొండ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సాగాయి. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు అనుసరించిన వ్యూహం తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. ఒక్క ప్రమాదమూ జరుగలేదు. జిల్లాకేంద్రంలో నాలుగు రోజులపాటు చేపట్టిన ఆపరేషన్ చబుత్రతో అంతా సవ్యంగా సాగింది. శాంతి భద్రతల విభాగం అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం రాత్రి అంతా విధుల్లోనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా హైవేలు, పట్టణాల్లోని ప్రధాన రహదారులపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించారు. వేడుకలు జరుపుకొనే క్రమంలో ఎవరూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చర్యలు తీసుకున్నారు.
మద్యం తాగి వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, ప్రకాశం బజార్లో వన్‌వే ఏర్పాటుచేశారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన వాహనదారులు వేగానికి బ్రేక్ వేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వయంగా పట్టణంలోని తిరిగి పర్యవేక్షించారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో 246 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిని గురువారం జిల్లా న్యాయస్ధానం ముందు హాజరు పర్చనున్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల తర్వాత మాత్రమే సాధారణ ట్రాఫిక్ వ్యవస్థను కొనసాగించారు.
సూర్యాపేట జిల్లాలోనూ ప్రశాంతంగా వేడుకలు
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సరం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని సఫలమైనట్లు ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ తెలిపారు. ప్రమాదాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణకు మంగళవారం రాత్రి కట్టుదిట్టమైన భద్రత, పెట్రోలింగ్, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు, యువతను ముందస్తుగా అప్రమత్తం చేయడం కూడా కలిసి వచ్చిందన్నారు. డీజేలు, బాణసంచా, రోడ్డు భద్రత నియమాల ఉల్లంఘన, బహిరంగ మద్యపానం, రోడ్లపై కేక్ కటింగ్‌లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పోలీసుల పని తీరు అభినందనీయం
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా పోలీసులు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకొనేందుకు జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నది.
– ఎస్పీ శరత్ చంద్ర పవార్