గురువారం 04 మార్చి 2021
Nalgonda - Jan 13, 2021 , 01:16:07

పోట్టనింపని గంగిరెద్దులాట

పోట్టనింపని గంగిరెద్దులాట

  • సంక్రాంతికే పరిమితమైన ప్రదర్శన
  • ఏడాదంతా కూలిపనులపైనే ఆధారం
  • సొంత బిడ్డల్లా...

సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చే గంగిరెద్దులాటకు నేడు ఆదరణ తగ్గిపోయింది. వానకాలం పంటలు చేతికొచ్చిన వేళ గంగిరెద్దుల ఆటతో ప్రజలు వినోదాన్ని పొందేవారు. ‘అయ్య గారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు..’ అంటుంటే లయబద్దంగా తలాడిస్తూ గంగిరెద్దు చేసే విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే కాలానుగుణంగా మారిన వినోద సాధనాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ కరువై పొట్ట కూటికీ కరువైన పరిస్థితి నెలకొంది. సన్నాయి బూర, డోలు, చేగంట, నెత్తికి రంగుల తలగుడ్డ, కోర మీసాలు, చెవులకు కమ్మల జోడు, వారూ వీరూ ఇచ్చిన పాత కోటు, భుజం మీద కండువాతో ఉన్నంతలో ఆకర్షణీయంగా తయారౌతారు. తమకు జీవనాధారమైన గంగిరెద్దులను సొంత బిడ్డల్లా చూసుకుంటారు. అందంగా అలంకరించి మూపురం నుంచి తోక వరకు రంగు రంగుల బొంతలతో కప్పుతారు. రింగులతో కొమ్ములను అలంకరించి వాటి చివరన ధగ ధగ మెరిసే ఇత్తడి గొట్టాలను, ఊలు దారాల కుచ్చులను, అందమైన గవ్వలను కడతారు. పొట్ట చుట్టూ తోలు బెల్టును, గవ్వల హారాన్ని, కాళ్లకు గజ్జెలు కడతారు. ఇంటి ముందుకెళ్లి నృత్యం చేసిన సమయంలో యజమానులు ఇచ్చే చీరలు, దుప్పట్లను వీపు మీద వేస్తుంటారు. అన్ని హంగులతో నృత్యం చేసే బసవన్నల అందం సాక్షాత్తూ నందీశ్వరుడిని పోలి ఉంటుంది. 

విన్యాసాలే ఉపాధి...

సంచారజాతులైన గంగిరెద్దుల కుటుంబాల్లో ఆడపిల్లలు ఇల్లిల్లూ తిరుగుతూ ఫ్యాన్సీ, స్టీలు వస్తువులు అమ్మి జీవనం సాగిస్తున్నారు. వారికున్న ఒకే ఒక ఆస్తి గంగిరెద్దే. స్థోమత లేకపోయినా అప్పు చేసి గంగిరెద్దును కొనుగోలు చేసి కులవృత్తిని అనుసరిస్తున్నారు. సంక్రాంతికి ముందు వలసపోయి గుడారాలు ఏర్పాటు చేసుకుని బిక్షాటన చేసి తిరిగి శివరాత్రికి కుటుంబాల వద్దకు చేరుకుంటారు. 

బొడ్డెమ్మలు తొక్కిస్తే మంచిదని...

బొడ్డెమ్మలను బసవన్నలతో తొక్కిస్తే మంచిదనే నమ్మకం ఉన్నది. గంగి ఆవు కడుపులో పుట్టిన ఎద్దునే గంగిరెద్దుగా భావిస్తాం. ఎవరైనా దానం చేసిన దూడలకు రూ.20వేలు ఖర్చు చేసి శిక్షణ ఇప్పిస్తాం. కులవృత్తి పట్ల సుముఖత లేని కారణంగా మా తరమే చివరిదని చెప్పాలె. జనవరి నుంచి సంక్రాంతి వరకు ఇల్లిల్లూ తిరిగి బియ్యం, చీరలు, డబ్బులు అడుక్కుని ఏడాదంతా కూలి పని చేసుకుని బతుకుతం. దినకర్మల్లో గంగిరెద్దును ఆడించి పొట్ట పోసుకుంటం. 

- ఆవుల వెంకన్న, ముకుందాపురం 

VIDEOS

logo