ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 9 : మండల పరిధిలోని నశింపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కృప తల్లిదండ్రులు బొడ్డు బక్కయ్య, రమణ. కృప తండ్రి రమణయ్య చనిపోవడంతో తల్లి రమణ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే ఒక్కగానొక్క కుమార్తె కృప(25)కు లివర్ (కాలేయం) దాదాపు 80 శాతం చెడిపోయింది. తన కూతురికి ఇటువంటి వ్యాధి రావడంతో తల్లి తట్టుకోలేక మనో వేదనకు గురైంది. ఉండేందుకు ఇల్లు తప్ప ఏమీలేని ఈ నిరుపేద కుటుంబానికి రోజూ ఇల్లు గడవటమే కష్టంగా మారింది. కాగా ఇటీవల కృప హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరింది.
ఆమె ఆపరేషన్‌కు దాదాపు రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చేరిన కృపకు హైదరాబాద్‌లోని అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాకేష్ రూ.లక్ష సాయం అందజేశారు. అయితే ఆ సాయం ఆమె వైద్యానికి సరిపోదు. దీంతో ఆమె ఇప్పుడు మళ్లీ ఉస్మానియా దవాఖానలో చేరింది. అక్కడ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తామని, అయితే కృప వయస్సుకు తగిన వారి లివర్ మాత్రమే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సెట్ అవుతుందని వైద్యులు తెలిపారు. కృప తల్లి లివర్ మ్యాచ్ కావడం లేదని డాక్టర్లు చెప్పారు. కృపకు సాయం చేసేందుకు దాతలు ముందుకు వచ్చి, ఆమెకు పునర్జన్మను ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు. కృపకు సాయం చేయదల్చుకున్న దాతలు ఆమె ఫోన్ నంబర్ 767195813కు ఫోన్ పే, కానీ గుగుల్ పే ద్వారా కానీ ఆర్థిక సాయం అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకోవాలని కోరుతున్నారు.