నల్లగొండ, అక్టోబర్ 15: మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు ప్రతి ఏటా ఉచితంగా చెరువుల్లో చేప పిల్లలు పోయాల్సి ఉండగా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే ఆలస్యమైన విషయం తెలిసిందే. ఇటీవల వర్షాలు కురుస్తున్నందున టెండర్లు పిలిచి చేప పిల్లలు పోయాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో నల్లగొండ జిల్లా మత్స్యశాఖ యంత్రాం గం ఆగమేఘాల మీద టెండర్లు పెలిచింది. కానీ, అసలు చేపల చెరువులే లేని వారు ఈ టెండర్లు వేయటంతో అందరికీ చెరువులు ఉన్నాయని.. అందులో పిల్లలు కూడా పెరిగాయని..వెంటనే ఫైనాన్స్ బిడ్స్ ఓపెన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పిల్లలు వదులుతామని కలెక్టర్కు విన్నవించారు మత్స్యశాఖ అధికారులు. ఇదిలా ఉండగా అసలు టెండర్లు వేసిన వాళ్లకు చెరువులే లేవని..వారిలో కొంత మంది హైదరాబాద్లో నివసిస్తారని, అస లు మాకు తెల్వకుండానే చెరువులు పరిశీలన చేశారని సొసైటీ సభ్యులు అనటం విశేషం. సొసైటీ అధ్యక్షుడిని మేనేజ్ చేసి చెరువులు లేకున్నా.. ఒక్కో టెండర్దారుడి నుంచి రూ.లక్ష తీసుకొని చెరువులు ఉన్నాయిని రిపోర్ట్ చేసి కలెక్టర్కు సబ్మిట్ చేయటం గమనార్హం. ఇక్కడి వాళ్లయితే చెరువులు లేకున్నా..టెండర్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చే అవకాశం ఉండటంతో ఆంధ్రావాళ్లతో టెండర్లు వేయించటం..రాజారాముడికే చెల్లింది.
సభ్యులు లేకుండానే చెరువుల పరిశీలన
జిల్లాలో ఈ ఏడాది మొత్తం 5.98 లక్షల చేప పిల్ల లు 1163 చెరువుల్లో పోయాలనే ఆలోచనతో టెం డర్లు పిలిచిన మత్స్యశాఖ అధికారులు అందులో 1.86లక్షల పిల్లలు 35 నుంచి 45ఎంఎం పిల్లలు, 4.11 లక్షలు 80 నుంచి 100 ఎంఎం పిల్లలు పోయాలన్నారు. ఇందుకు గానూ అనతి కాలంలో చేప పిల్లలు కావాలని..ఇక్కడి వాళ్లు చెరువులు ఉండి, అందులో ఇప్పటికే పిల్లలు ఉంటేనే టెం డర్లు వేయాలని ఆంధ్రావాళ్లను ఆహ్వానించారు. దీంతో హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉండే లక్ష్మీ ఏజెన్సీస్, కైకలూరుకు చెందిన కోమలవల్లి, అన్నపూర్ణ, విజయ్ ఆల్ఇన్ వన్ ఫిష్సీడ్, రాజాఫిష్ నేలకొండపల్లితోపాటు స్థానికంగా ఉండే పెరుమాళ్ల ఎల్లయ్య టెండర్లు వేశారు. చెరువుల పరిశీలనకు జిల్లా మత్స్య సహకార కోఆపరేటివ్(డీఎఫ్సీవోఎస్)వారితో కలిసి పరిశీన చేయకుండా, ఆ సంఘం అధ్యక్షుడిని మేనేజ్ చేసి ఆ శాఖ అధికారి ఒక్కడే ఏక పక్షంగా వెళ్లి పరిశీలన చేసి చెరువులు ఒకే..అందులో చేప పిల్లలు ఓకే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నోట్ తయారు చేసి కలెక్టర్కు పెట్టడానే ఆరోపణలు వస్తున్నాయి.
పరిశీలనకు లక్ష..తర్వాత 20శాతం
డీఎఫ్సీవోఎస్ కమిటీ ఉంటే చేప పిల్లల పంపిణీ జరగదు. దీంతో గతేడాది ఈ జిల్లాకు చెందిన వాళ్లే చేపి పిల్లలు ఆయా చెరువుల్లో వదిలారు. ఈసారి ఈ సొసైటీ పీరియడ్ 180రోజులు పూర్తి కావటంతో మీకు హక్కు లేదని..మీ పీరియడ్ అయిపోయిదని చెప్పి ఆ సంఘం అద్యక్షుడిని ఒక్కడిని మేనేజ్ చేసి సంబంధిత శాఖ ఉన్నతాధికారి(సెక్షన్ సిబ్బంది కూడా లేకుండా)మాత్రమే వెళ్లి ఆయా టెండర్దారుల నుంచి రూ.లక్ష చొప్పు న తీసుకొని అనుకూల రిపోర్ట్ ఇచ్చాడు. పిల్లలు పోసి బిల్లులు వచ్చాక బిల్లుల్లో 20శాతం కమిషన్ ఇవ్వాలనే ఒప్పందం కూడా ముందే జరిగింది.
కమిటీ సభ్యులతో వెళ్లి పరిశీలించాం
జిల్లాలో చేప పిల్లలు పోయటానికి ప్రభుత్వ ఆదేశానుసారం టెండర్లు పిలిస్తే ఆరుగురు వేశారు. దీంతో కోఆపరేటివ్ సొసైటీతో కలిసి వెళ్లి చెరువులను పరిశీలించాం. త్వరలో ఫైనా న్స్ బిడ్స్ ఓపెన్ చేసి ఆయా చెరువుల్లో పిల్లలు పోస్తాం. ఇదే విషయమై సొసైటీ సభ్యుడిని అడిగితే పరిశీలనకు వెళ్లింది తెలవదు. సొసైటీ పీరియడ్ అయిపోయిందని కొందరు..ఉన్నదని మరికొందరు అంటున్నారు. – రాజారామ్, ఇన్చార్జి ఏడీ, ఫిషరీస్ నల్లగొండ
ఫిషరీష్ శాఖకు అడహక్ కమిటీ కాలం లేదు
మత్స్యశాఖకు సంబంధించిన ఫెడరేషన్ అడహక్ కమిటీ పీరియడ్ పూర్తి అయింది. 180 రోజులు పూర్తి కాగానే, వాళ్ల పీరియడ్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తేనే అందుబాటులోకి వస్తుంది.
– పత్యానాయక్, డీసీవో, నల్లగొండ