బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 03, 2020 , 23:29:25

నేను కేసీఆర్‌ వెంటే..

నేను కేసీఆర్‌ వెంటే..

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నేను కేసీఆర్‌ వెంటే ఉన్నాను. టీఆర్‌ఎస్‌ నా సొంత పార్టీ. మున్సిపాల్టీ ఎన్నికల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరపున పోటీ చేసిన అనుచరులది కేవలం భావోద్వేగమే. ఈ పంచాయతీ కుటుంబ తగాదా మాత్రమే. గిట్టని వాళ్లు పార్టీ మారుతున్నానని చేసే దుష్ప్రచారాన్ని తాను పూర్తిగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వెలమ సంఘం భవనంలో సోమవారం జూపల్లి విలేకరులతో మాట్లాడారు. తాను టీఆర్‌ఎస్‌లోనే ఉన్నానన్నారు. మా నాయకుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ సాధనకోసం మంత్రి పదవీని త్యజించి టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అబివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతుందన్నారు. దీంతో అన్నిరకాల ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీతో పాటు స్థానిక, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ దేశంలో ఎక్కడా లేని ఫలితాలు టీఆర్‌ఎస్‌కు వచ్చాయన్నారు. ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు ఉంటాయని, కాని మన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వెంటనే ప్రజలు ఉంటున్నారన్నారు. దీనికి కారణం రా ష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్‌పై నమ్మకమే అన్నా రు. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అసాధారణ గెలుపు సాధించిందన్నారు. ఇక తనపై గత కొంత కాలంగా సోషల్‌ మీడియాలో, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ రకరకాల ఊహగానాలు ప్రచురితమవుతున్నాయని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న ప్రచారం అవాస్తవమని కొట్టి పారేశారు. తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తాను అదే పార్టీలోనే ఉంటానన్నారు. ఇప్పటికీ తాను టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తున్నానని, ప్రతిపక్షాలు, తానంటే గిట్టని కొందరు కాంగ్రెస్‌, బీజేపీలోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు అలాంటి ఖర్మ పట్టలేదన్నారు. పూటకో పార్టీ మార్చే వాడిని కాదన్నారు. ఇంకో పార్టీ అనే ఆలోచనే రాదన్నారు. కొల్లాపూర్‌ పంచాయతీ కుటుంబ తగాదా మాత్రమే అన్నారు. తనకు, ఎమ్మెల్యేకు మధ్య స్థానికంగా వచ్చిన విభేదాలు చిన్న మనస్పర్థల్లాంటివే అన్నారు. భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య వచ్చిన మనస్పర్థల మాదిరిగా పరిగణించాలన్నారు. ఇలాంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో భావోద్వేగంతో, ఆత్మగౌరవం కోసమే తన వెంట ఉన్న కొందరు ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరపున కౌన్సిలర్లుగా పోటీ చేశారన్నారు. వాళ్లంతా తెలంగాణ కోసం పోరాడిన వాళ్లేనని, ఇప్పటికీ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారన్నారు. తమ కోసం నిబద్ధతతో పని చేసే వారినే ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. ఇదే ఈ ఎన్నికల్లో నిరూపితమైందన్నారు. తాను మాత్రం జీవితాంతం మా నాయకుడైన కేసీఆర్‌ వెంటే, టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్యప్రతాప్‌ గౌడ్‌, మం డల పార్టీ అధ్యక్షుడు దండు నరసింహ, నాయకులు పగిడాల చిన్నయ్య పాల్గొన్నారు.


logo