గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 03, 2020 , 00:11:14

నేడు ‘సహకార’ నోటిఫికేషన్‌

నేడు ‘సహకార’ నోటిఫికేషన్‌
  • ఈ నెల6నుంచి నామినేషన్ల స్వీకరణ
  • 23విండోలు, లక్ష మంది ఓటర్లు రిజర్వేషన్ల ఖరారుతో పోటీపై స్పష్టత మరో పోరాటానికి సిద్ధమైన పార్టీలు
  • ఈనెల 15న పోలింగ్‌, మధ్యాహ్నం ఫలితాలు
  • 299డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు

నాగర్‌కర్నూల్‌ నమస్తే తెలంగాణ ప్రతినిధి: సహకార సంఘాల ఎన్నికల సంరంభం ఆరంభమైంది. జిల్లాలోని 23సింగిల్‌ విండోల పరిధిలోని 299డైరెక్టర్ల పదవులకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కార్యాచరణను అధికారులు పూర్తి చేశారు. ప్రతి సింగిల్‌ విండోలో 13డైరెక్టర్లు ఉంటారు. ఇందులో 2ఎస్సీలకు, 2బీసీలకు, 1ఎస్టీకి, 1జనరల్‌ మహిళకు కేటాయించబడుతాయి. దీని ప్రకారం ఎస్సీలకు 46స్థానాలు, బీసీలకు 46స్థానాలు, 23ఎస్టీలకు, మరో 23జనరల్‌ మహిళలకు ఖరారు కానుండగా 162డైరెక్టర్‌ పదవులు జనరల్‌గా ఉంటాయి. ఇందులో ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇక ఛైర్మన్‌ పదవులకు మాత్రం ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. ఈ ఎన్నికలను మెజార్టీ సీట్ల ప్రకారం పరోక్ష పద్ధతిలో మరుసటి రోజు సింగిల్‌ విండో ఛైర్మన్లను ఎన్నుకుంటారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా సింగిల్‌ విండోల ఎన్నికలు జరుగుతున్నాయి. చివరగా 2013, ఫిబ్రవరిలో జరిగాయి. ఆ తర్వాత నుంచి ఎన్నికల నిర్వహణ చేపట్టలేదు. దీనివల్ల ఆ పాలక మండళ్ల పదవీ కాలాన్నే ఆరు నెలల చొప్పున పొడిగిస్తూ వస్తున్నారు. ఇలా పొడిగించబడిన తాజా గడువు ఈనెల 4వ తేదీతో ముగియనుంది. మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంకాగా ఎన్నికల కమీషన్‌ సైతం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం సోమవారం ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈనెల 6,7,8తేదీల్లో మూడు రోజులు నామినేషన్లు స్వీకరిస్తారు. 


అనంతరం 15వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. ఫలితాలు కూడా మధ్యాహ్నం 3గంటల నుంచి లెక్కించి వెంటనే ప్రకటిస్తారు. దీనివల్ల ఒకే రోజులోనే విజేతలెవ్వరో తేలనుంది. కాగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఓటర్ల జాబితాను, రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. జిల్లాలో 1లక్ష మంది వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొంటారు. ఇక రిజర్వేషన్లపై కూడా స్పష్టత రావడంతో పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌లో ఈ పోటీ అధికంగా ఉంది. పంచాయతీ, పరిషత్‌, పురపాలికల్లో మాదిరిగానే డైరెక్టర్ల పదవులకు పోటీ చేసేందుకు ఎమ్మెల్యేల ఆశీర్వాదం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్టర్లుగా గెలిచిన తర్వాత విండో ఛైర్మన్లుగా ఎన్నిక కావడమే లక్ష్యంగా పలువురు మండల స్థాయి నాయకులు ఆశతో ఉన్నారు. 


ఇంతకు ముందు ఎన్నికల్లో ఓడిపోయిన, పార్టీకి మండలంలో పట్టున్న ముఖ్యమైన నాయకులకు ఛైర్మన్‌ పదవులను కట్టబెట్టి పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోనున్నారు. ఇక వరుస ఎన్నికల్లో కుదేలైన ప్రతిపక్షాలు మాత్రం పరపతి దక్కించుకునేందుకు ఆరాట పడుతున్నాయి. ఇక్కడా ఆశించిన స్థాయిలో డైరెక్టర్ల పదవులకు పోటీ పడే ఆశావహులు కనిపించడం లేదు. దీనివల్ల పంచాయతీ, పురపాలికల మాదిరిగా మొక్కుబడిగా పోటీ చేయించేందుకు కమలం, కాంగ్రెస్‌లు సిద్ధమవుతున్నాయి. రైతుల కోసం అమలు చేసిన రైతుబంధు, రైతుభీమా, 24గంటల కరెంట్‌, ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు పూర్తి చేయించడం, చెరువులను పునరుద్ధరించడంలాంటి చర్యలతో రైతన్నల్లో టీఆర్‌ఎస్‌ పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. గత ఎన్నికల ఫలితాల్లోనూ రైతన్నలు తమ ఓటింగ్‌తో దీన్ని నిరూపించగా తాజాగా జరిగే రైతుల ఎన్నికల్లోనూ మరోసారి చరిత్రను పునరావృతం చేస్తారని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా సహకార ఎన్నికలకు సమరశంఖం పూరడంతో గ్రామాల్లో మరోసారి రాజకీయ వేడి రగులుకొంది. 


logo