సోమవారం 10 ఆగస్టు 2020
Mulugu - Jan 25, 2020 , 02:14:38

టూరిజం హబ్‌గా ములుగు జిల్లా

టూరిజం హబ్‌గా ములుగు జిల్లా
  • - తెలంగాణలో పర్యాటకానికి భవిష్యత్తు
  • - లక్నవరం సుందరంగా తీర్చిదిద్దుతాం
  • - ఐలాండ్‌లో మరిన్ని అభివృద్ధి పనులు
  • -టీఎస్‌ టీడీసీ చైర్మన్‌ భూపతిరెడ్డి




గోవిందరావుపేట, జనవరి 24: ములుగు జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని, లక్నవరం పర్యాటక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచేలా అభివృద్ధి పనులు చేపడుతామని టీఎస్‌ టీడీసీ చైర్మన్‌ భూపతిరెడ్డి పేర్కొన్నారు. లక్నవరం సరస్సును ఆయన  శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు యూనిట్‌ మేనేజర్‌ పుల్లారెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎకో టూరిజం అధికారి సుమన్‌ స్వాగతం పలికారు. వేలాడే వంతెలనపై నడుస్తూ బోటులో షికారు చేసి ఐలాండ్‌లను పరిశీలించారు. అనంతరం ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంత ప్రకృతి వనరులు కలిగిన సరస్సు ఎక్కడా లేదని, చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో సరస్సు, ఆహ్లాదాన్ని కనబర్చే ప్రాంతం మరొకటి లేదన్నారు. లక్నవరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. బుస్సాపురం నుంచి లక్నవరం సరస్సు డబుల్‌ రోడ్డు నిర్మాణం, ఐలాండ్‌లో నూతన హంగులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహకారంతో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పర్యాటకులను కనువిందు చేసే అద్భుతమైన ప్రాంతాలు ములుగు జిల్లాలో ఉన్నాయని, తెలంగాణలో టూరిజానికి మంచి భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం ఇప్పటికే రామప్ప, బొగత, మల్లూరు, మేడారం తదితర దేవాలయాల ప్రాంతాలతో పాటు లక్నవరంలో అభివృద్ధి పనులు చేపట్టి ములుగు జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంచుకున్నామని వెల్లడించారు. ఇక్కడి అభివృద్ది పనులపై వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని నిధులు కేటాయించేలా కోరుతామని చెప్పారు.



logo