శుక్రవారం 14 ఆగస్టు 2020
Mulugu - Jan 15, 2020 , 02:48:30

టీఆర్‌ఎస్‌లో సమన్యాయం

టీఆర్‌ఎస్‌లో సమన్యాయం


భూపాలపల్లి టౌన్‌, జనవరి 14 : టీఆర్‌ఎస్‌ పార్టీలో అభ్యర్థులకు సమన్యాయం జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఇందిరాభవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎన్నికల పరిశీలకుడు వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌, ఎన్నికల ఇన్‌చార్జి గోవింద్‌నాయక్‌, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతితో కలిసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. పెద్దల సహకారం, అభిప్రాయ సేకరణ, సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేసి సముచిత స్థానం కల్పించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ తదితర కులాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరికీ సమన్యాయం చేశామని, టికెట్ల కేటాయింపులో 96శాతం సఫలీకృతులమయ్యామని అన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలను కలుపుకుపోవాలని చేసిన సూచన మేరకు నామినేషన్‌ వేసిన ప్రతి ఒక్కరితో మాట్లాడామని, నాలుగు రోజులుగా అభ్యర్థులందరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు సైతం మూడు టికెట్లు కేటాయించామని, అసంతృప్తులు లేకుండా అందరిని ఒప్పించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డులలో తొమ్మిదో వార్డు నుంచి తొట్ల సంపత్‌ ఏకగ్రీవమయ్యారని తెలిపారు. మరో 7 లేదా 8 వార్డుల్లో ఏకగ్రీవం అయ్యేదని, ప్రత్యర్థులు నామినేషన్లు వేసిన అభ్యర్థులందరినీ క్యాంపునకు తరలించారన్నారు. దీంతో వారి అభ్యర్థులపై వారికి నమ్మకం లేని పరిస్థితి నెలకొందన్నారు. మిగిలిన 29స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పాగా వేస్తుందన్నారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్స్‌ టీం మంచిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, భూపాలపల్లిని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు రూపకల్పన చేసుకున్నామని తెలిపారు.

తమకంటూ ఒక విజన్‌ ఉన్నదని, విజన్‌ ప్రకారం ముందుకు సాగుతామన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగే పార్టీలు ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం సీఎంను భూపాలపల్లికి పిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఎన్నికల అనంతరం నిర్ణయించనున్నట్లు తెలిపారు. అనంతరం గుండా ప్రకాశ్‌ మాట్లాడుతూ నాలుగు రోజులుగా పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థితో మాట్లాడి ఫైనల్‌ చేశామన్నారు. తొమ్మిదో వార్డులో ఏకగ్రీవం కావడం హర్షణీయమన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు జరిపిన సంక్షేమ పథకాలు ప్రజలకు గుండెల్లో నిలిచిపోయాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నిలబడే ఇతర అభ్యర్థులకు డిపాజిట్‌ రాదన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీలో 29స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందుతారనే నమ్మకం ఉందన్నారు. రెండు వార్డుల్లో తాను ప్రచారం చేశానని, ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు మేకల సంపత్‌యాదవ్‌, బుర్ర రమేశ్‌, ఆకుల మహేందర్‌, కటకం జనార్దన్‌, సిద్ధు, నాగపూరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


logo