‘ముద్దమందారం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ ముద్దుగుమ్మ తనూజ పుట్టస్వామి. తన అసలు పేరుతో కంటే ముద్దమందారం పార్వతిగానే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించి మొదటి సీరియల్‌తోనే మంచి మార్కులు కొట్టేసింది. అక్క లాయర్, చెల్లి ఇంజినీర్.. కానీ తాను మాత్రం నటనపై మక్కువ పెంచుకుంది. అనుకోకుండా సినీ పరిశ్రమకు పరిచయమై నటననే వృత్తిగా ఎంచుకుంది. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా తానేంటో నిరూపించుకుంటూ కన్నడ, తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కన్నడ సోయగం తనూజ పుట్టస్వామి జిందగీతో పంచుకున్న ముచ్చట్లు…
Thanuja Puttaswamy | మాది ఉమ్మడి కుటుంబం. అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్. కానీ నేను చాలా అల్లరి పిల్లని. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. నేను మధ్యలో అమ్మాయిని. మిగతా ఇద్దరూ అమ్మానాన్న చెప్పినట్లు విని మంచి పిల్లలు అనిపించుకునేవాళ్లు. నేను మాత్రం స్కూల్ టైం నుంచి లాస్ట్ బెంచ్ స్టూడెంట్‌ని. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండేదాన్ని. మా నాన్నకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. మా మేనత్త కొడుకు కూడా లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. దాంతో నాన్న నన్ను కూడా టీచర్ చేయాలని అనుకున్నారు. కానీ నేను అనుకోకుండా నటనవైపు వచ్చాను. కాలేజీ టైమ్‌లో ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు.
నాన్న దాదాపు మూడేండ్లు మాట్లాడ్డం మానేశారు. అయినప్పటికీ నేను పట్టు వదలకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని వెండితెరకు పరిచయమయ్యా. కన్నడ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘ముద్దమందారం’ సీరియల్లో ఆఫర్ వచ్చింది. మొదట భయపడ్డా. కానీ ధైర్యం చేసి ఒప్పుకొన్నా. నాకు తెలుగు కొంచెం కూడా అర్థమయ్యేది కాదు, దాంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియక ఏడ్చేసేదాన్ని. కానీ సీరియల్ టీమ్ అందరూ నాకు సపోర్ట్ చేసి ప్రతీదీ అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు ఇంత బాగా తెలుగు మాట్లాడగలుగుతున్నానంటే.. ఈ క్రెడిట్ అంతా ముద్దమందారం సీరియల్ టీమ్దనే చెప్పాలి.
నా మొదటి సినిమా తర్వాత ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపైనా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ముద్దమందారం సీరియల్ ఏకంగా ఆరు సంవత్సరాలు ప్రసారమైంది. ఆ సమయంలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ సీరియల్ షూట్‌కి, సినిమాల షూటింగ్‌కి తేదీలు క్లాష్ కావడంతో కొన్ని అవకాశాలు వదులుకున్నా. నేను ఏ ప్రాజెక్ట్ ఓకే చేయాలన్నా మా అమ్మానాన్న పర్మిషన్ తీసుకున్నాకే సైన్ చేస్తాను. కొవిడ్ టైమ్‌లో కొన్ని అవకాశాలు వచ్చినా కుటుంబాన్ని మిస్ అవుతున్నాననిపించి రెండేండ్లు గ్యాప్ తీసుకున్నా. అంతా సద్దుమణిగిన తర్వాత మళ్లీ కథలు వినడం ప్రారంభించా. ఏ సీరియల్, సినిమా అవకాశం వచ్చినా నా మొదటి ప్రాధాన్యత కథకే. నా పాత్రకు ఉండే ప్రాధాన్యతను బట్టే ఓకే చేస్తాను. ఇప్పటికీ చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ ఆచితూచి ఎంచుకుంటున్నా. ఒకేసారి రెండుమూడు ప్రాజెక్టులు ఒప్పుకోను. ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే మరొకటి ఒప్పుకొంటా. కెరీర్తోపాటే కుటుంబానికీ తగినంత సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తా. ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో మంచి రోల్ చేస్తున్నా. ఆ సినిమా పేరు ఇప్పుడే చెప్పలేను.
జీ తెలుగు ఛానెల్ నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది. అందుకే జీ కుటుంబంలో సభ్యురాలిగా మారిపోయా. సూపర్ జోడీ షో ద్వారా మరోసారి నాలోని కొత్త యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. నాకు డ్యాన్స్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. అలాంటి నేను ఒక డ్యాన్స్ షోలో పోటీపడటం నమ్మలేకపోతున్నా. ఇదే నా ఫస్ట్ డ్యాన్స్ కాంపిటీషన్. దాదాపు ఫైనల్ చేరుకున్నాం. టైటిల్ గెలుచుకుంటామనే నమ్మకం ఉంది. అందుకోసం ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువే కష్టపడుతున్నాం. జగద్ధాత్రి సీరియల్లో గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపించడం కూడా చాలా సంతోషం కలిగించింది. ఐదేండ్ల తర్వాత మళ్లీ మేమంతా కలిసి నటించడం చాలా బాగుంది. ఇన్నేండ్ల తర్వాత కనిపించినా మళ్లీ ప్రేక్షకులంతా ముద్దమందారం పార్వతి అంటూ నన్ను గుర్తుపట్టి ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. కన్నడ అమ్మాయినైనా తెలుగు ప్రేక్షకులు తమ అమ్మాయిగానే ఆదరించారు. నేను గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది మా కుటుంబ సభ్యులను అడిగి మళ్లీ నేను తెరపై కనిపించేందుకు కారణమయ్యారు. ప్రతి ఒక్కరి జీవితంలో పెండ్లి అనేది ఒక అద్భుతమైన విషయం. నా జీవితంలో ఆ అద్భుత క్షణం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.
వేసవి కాలం వచ్చిందంటే ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా వీలైనంతవరకు జ్యూస్‌లు, కొబ్బరినీళ్లు, నీళ్లు తాగుతూ ఉంటా. మన శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉండటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. రెండు రోజులకు ఒకసారి ఐస్ క్యూబ్‌తో పడుకునే ముందు ముఖాన్ని రబ్ చేసుకుని నైట్ క్రీమ్ రాసుకుంటా. వేసవి కాలంలో చర్మం కాంతిమంతంగా ఉండేందుకు ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఏ పండుగ వచ్చినా మా అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్తుంటాం. పుస్తకాలు ఎక్కువగా చదువుతాను.
– హరిణి