సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Feb 06, 2020 , 02:00:59

ప్రైవేటు రైళ్లు వస్తున్నాయ్‌.!

ప్రైవేటు రైళ్లు వస్తున్నాయ్‌.!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇప్పటివరకు నగరం నుంచి రైల్వేకు సంబంధించిన రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తుండగా త్వరలో నగరంలోని స్టేషన్ల నుంచి ప్రైవేటు రైళ్లు ప్రయాణికుల కోసం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పింక్‌ బుక్‌లో పేర్కొనగా ఈ విషయాలను దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా బుధవారం రైల్‌నిలయంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో వెల్లడించారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పీపీపీ) విధానంలో ఈ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రైవేటు రైళ్లు నడుపనున్నారు. త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు చెప్పారు.


ఎంఎంటీఎస్‌ రెండోదశ రూ.40 కోట్లు

అదేవిధంగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.817 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండోదశకు  ప్రస్తుత బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించారు. 2017 నాటికి పూర్తిచేస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా పూర్తికాలేదు. సికింద్రాబాద్‌ నుంచి బొల్లారం మధ్య కొత్త లైన్‌ పూర్తిచేశారు. దీనికి రైల్వే భద్రత కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌, మల్కాజిగిరి నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్‌ వరకు కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటికోసం రూ.40 కోట్లు కేటాయించింది.


యాదాద్రికి రూ.10లక్షలు

ఎంఎంటీఎస్‌ రెండోదశ విస్తరణలో భాగంగా ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు చేపట్టిన పనుల కోసం దక్షిణమధ్య రైల్వే కేవలం రూ.10 లక్షలు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 33 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి రూ.412 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. ఇందులో రైల్వే , తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. 


చర్లపల్లి టెర్మినల్‌కు రూ.5 కోట్లు

నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్ల మీద ఒత్తిడి తగ్గించేందుకు నిర్మిస్తున్న శాటిలైట్‌ చర్లపల్లి టెర్మినల్‌కు రూ.5 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న వట్టినాగులపల్లి టెర్మినల్‌కు ఎటువంటి కేటాయింపులు లేవు. ఇక ఎప్పటిమాదిరిగానే అన్‌మ్యాన్డ్‌ రైల్వే క్రాసింగ్‌లను తొలగించేందుకు నిధులు కేటాయించారు.logo