బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Jan 21, 2020 , 00:48:51

అప్పుడు 14 రోజులకోసారి ఇప్పుడు.. రోజు విడిచి రోజు

అప్పుడు 14 రోజులకోసారి ఇప్పుడు.. రోజు విడిచి రోజు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దాహార్తితో అలమటించిన ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపలి గ్రామాలకు పట్టణ భగీరథ వరంలా మారింది. అప్పట్లో దాహార్తితో అలమటించిన ప్రజలకు జలమండలి అధికారులు ప్రస్తుతం సమృద్ధిగా తాగునీరు అందిస్తున్నారు.
14 రోజులకొకసారి, అందులోనూ అరకొరగా నీటి సరఫరా మాత్రమే జరిగేది.  అర్బన్‌ మిషన్‌ భగీరథలో భాగంగా జలమండలి రూ. 756 కోట్ల అంచనాతో  రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని 190 గ్రామ పంచాయతీలు, ఏడు నగర పాలక సంస్థల పరిధిలో ప్రస్తుతం రోజు విడిచి రోజు సమృద్ధిగా తాగునీరు అందుతున్నది. 164 రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకువచ్చి  190 గ్రామాల్లో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు.
ఈ ప్రాజెక్టు  ద్వారా 10 లక్షల జనాభాకు లబ్ధి జరుగడంతో పాటు కొత్తగా 1, 50, 000 నల్లా కనెక్షన్లు మంజూరు చేశారు. పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 వేలకు పైగా రూపాయి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా బోరు మీదనే ఆధారపడిన 58 గ్రామాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి మొదటి ఇక్కడి నుంచే పట్టణ భగీరథ ఫలాలు అందించడం, పనులు కూడా నిర్దేశిత లక్ష్యం కంటే ముందుగానే పథకం పూర్తి చేయడం గమనార్హం. ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్‌, శామీర్‌పేట, కీసర, కుత్బుల్లాపూర్‌, ఘట్‌కేసర్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, మహేశ్వరం, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు మండలాల్లోని గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రతి మనిషికి రోజుకు 125 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నట్లు  జలమండలి ఎండీ దానకిశోర్‌  తెలిపారు.  నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని పేర్కొన్నారు.logo