పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 8: ఆడియో రంగంలో చోటుచేసుకుంటున్న అధునాతన పరిజ్ఞానంపై ప్రపంచ ప్రఖ్యాత ఆడియో టెక్నాలజీ మార్గదర్శకుడు, బ్రాండెన్బర్గ్ ల్యాబ్స్ జీఎంబీహెచ్ సీఈవో, జర్మనీలోని ఇల్మెనావ్ టెక్నికల్ విశ్వవిద్యాలయ సీనియర్ ప్రొఫెసర్ కార్ల్ హీన్జ్ బ్రాండెన్ బర్గ్ అవగాహన కల్పించారు.
పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం హైదరాబాద్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో మంగళవారం ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం (ఈఈసీఈ) సిగ్నల్ ప్రాసెసింగ్, అంతర్జాతీయ కెరీర్ అభివృద్ధి రంగాలపై విశిష్ట వక్తలతో ఉపన్యాసాలు నిర్వహించింది. ఎంపీ3 ఫార్మాట్ కీలక ఆవిష్కర్తలలో ఒకరిగా పేరొందిన ప్రొఫెసర్ బ్రాండెన్ బర్గ్, ఓకియానోస్ ప్రో, పార్టీ వంటి అత్యాధునిక సాంకేతికతలపై ప్రొఫెసర్ లోతైన అవగాహన కల్పించారు.
ఆడియో కోడింగ్ పరిణామం, శ్రవణ అవగాహనలో పురోగతి, మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ (ఎంఐఆర్), స్పేషియల్ ఆడియో, హెడ్ ఫోన్ ఆధారిత లిజనింగ్ టెక్నాలజీల వంటి ఉద్భవిస్తున్న ధోరణులను ప్రొఫెసర్ బ్రాండెన్ బర్గ్ వివరించారు. 2026 నాటికి క్యూ4లో ప్రారంభించే అవకాశం ఉన్న బిల్డ్-ఇన్ హెడ్-ట్రాకింగ్ సెన్సార్లతో కూడిన కొత్త హెడ్ ఫోన్ ఉత్పత్తి కోసం ప్రణాళికలను ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో ఊహించని స్థాయిలో ఆడియో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని ప్రొఫెసర్ కార్ల్ హీన్జ్ బ్రాండెన్ బర్గ్ తెలిపారు. న్యూఢిల్లీలోని సెరాఫిమ్ కమ్యూనికేషన్స్ ఎల్ఎల్పీ వ్యవస్థాపకురాలు, సీఈవో సునందరావు-ఎర్డెమ్ జర్మనీలో వృత్తిపరమైన అవకాశాలు అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రామస్వామి వేదాల, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టీ మాధవి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చేపూరి అఖిలేశ్, ఈఈసీఈ ప్రొఫెసర్ త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.