సిద్దిపేట టౌన్, మే 14 : రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సులో చేరాలంటే ‘దోస్త్’ కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల పారదర్శకత కోసం 2016 నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)ను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి 2024-25 సంవత్సరానికి నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రంలో నచ్చిన యూనివర్సిటీ పరిధిలో కళాశాలలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందేందుకు చక్కటి దిక్సూచి ‘దోస్త్’. తొలి విడుత అడ్మిషన్లకు ఈ నెల 6నుంచి ఈ నెల 25 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. మూడు విడుతల్లో జరిగే అడ్మిషన్ల ప్రక్రియ జూలై 7తో ముగియనుంది. ఆ వెంటనే తొలి సెమిస్టర్ తరగతులు జూలై 8 నుంచి ప్రారంభమవుతాయి. విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్‌తోపాటు దోస్ మొబైల్ యాప్‌లో కూడా ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.జిల్లా కేంద్రం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1560, సిద్దిపేట మహిళా డిగ్రీ కళాశాలలో 240, గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో 560, బాలుర కళాశాలలో 480, చేర్యాలలో 240,దుబ్బాకలో 240, హుస్నాబాద్‌లో 240 మొత్తం 3560 సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరం నూతనంగా బీఏ పబ్లిక్ ఫైనాన్స్ కోర్సులో 60, బీకాం ఫైనల్లో 60, బీఏ హెచ్‌ఈపీలో 60 సీట్లు ప్రారంభమయ్యాయి.ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుతోపాటు తత్సమాన కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ ఆయా కోర్సులో చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దోస్త్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్‌తో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులు తమ ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. http://dost.cgg.gov.in వెబ్సైట్లోగానీ DOST మొబైల్ యాప్‌లోగానీ లాగిన్ కాగానే దోస్త్ ఐడీ, పిన్ నంబర్ వస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు విద్యార్థులు రూ. 200 క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. వీటిని ఉపయోగించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఓపెన్ అయిన సైట్లో యూనివర్సిటీ, కళాశాలల వారీగా ప్రాధాన్యత క్రమంలో కోర్సుల ఎంపిక, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సిలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంచుకున్న కళాశాలకు వెళ్లి అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపించాలి. వారు అక్కడ అడిగిన సర్టిఫికెట్స్‌ను అందజేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్థి ఏ కళాశాలలో, ఏ గ్రూప్‌లో చేరదల్చుకున్నాడో వాటిని ప్రాధాన్యత ప్రకారం ఎంపిక చేసుకోవాలి. ఎన్ని కళాశాలల్లో ఆ విద్యార్థికి సంబంధించిన కోర్సు ఉంటుందో వాటిని నమోదు చేసుకోవాలి. కళాళాలలు, గ్రూప్స్ ఎంపిక పూర్తి కాగానే సేవ్ బటన్ నొక్కితే వెంటనే సేవ్ అయిపోతుంది. అప్పు డు ఏ కళాశాలల్లో దరఖాస్తు చేసుకున్నామో అందుకు సంబంధించిన పత్రాలు జనరేట్ అవుతాయి. వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలో డిగ్రీలో చేరడానికి నోఫిటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులంతా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దోస్త్ అడ్మిషన్లలో సందేహాల కోసం ప్రత్యేక హైల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఏమైనా తప్పులు జరిగితే వర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చి సవరణ చేసుకునే అవకాశం ఉంది.
దోస్త్ ద్వారా డిగ్రీలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ఉచిత సేవలు అందిస్తు న్నాం. జిల్లా వ్యాప్తంగా ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో అన్ని రకాల మౌలిక వసతులతోపాటు నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు.