మెదక్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : బక్రీద్ పండుగను శాంతియుతంగా, మతసామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 7న బ్రకీద్ పండుగ సందర్భంగా పోలీస్, పశుసంవర్ధక, రెవెన్యూ, రవాణా, మున్సిపల్ కమిషనర్స్, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించింది. బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి, ప్రార్థనా స్థలాల పరిశ్రుభత, గోవుల అక్రమ రవాణాను నివారించడం, బందోబస్తు నిర్వహణ ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మత సామరస్యానికి చిహ్నంగా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖకు సూచించారు. గోవులను రక్షించడంలో భాగంగా పోలీస్ శాఖ వాహనాలను సీజ్ చేసినప్పుడు గోవులను గోశాలకు తరలించినప్పుడు వాటికి.. దానా అందించడానికి మున్సిపల్ శాఖ తరఫున చర్యలు తీసుకోవాలన్నారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లకు మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు సహకారం అందించాలని తెలిపారు. మెదక్ పట్టణంలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని కబేళాల వద్ద నీటి సమస్యలను నివారించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి సూచించారు. శానిటేషన్ విషయంలో మున్సిపల్, పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రార్థనా స్థలాలను పరిశ్రుభంగా ఉంచాలని ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు, అధికారులకు తెలియజేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ వర్గానికి చెందిన వారైనా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.
ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే సంబంధిత పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రపజల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే జిల్లాలో పోలీస్ అధికారులు దృష్టికి తీసుకురావాలని స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. కార్య్రకమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.