రాయపోల్ ఎప్రిల్ 19 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం నూతనంగా నిర్మించిన శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవానికి ముస్తాబయింది. ఈనెల 20 నుంచి మూడు రోజులపాటు ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ పద్మశాలి సంఘం సభ్యులు ఎంతో కష్టపడి గ్రామంలోని దేవుని చెరువు సమీపంలో భక్త మార్కండేయ ఆలయాన్ని నిర్మించారు. వార్షికోత్సవ సందర్భంగా ఆలయాన్ని అందంగా రంగురంగులతో అలంకరించారు. విద్యుత్ దీపాలతో ఆలయం ద్వేదీప్యమానంతో అందంగా అలంకరించారు.
మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలు సందర్భంగా మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొననుంది. ఉత్సవాల్లో భాగంగా 20 సోమవారం గణపతి పూజ, దీపారాధనతో పాటు తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. 21న మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 22న మార్కండేయ స్వామి ఆలయంలో భక్తులు దర్శించుకోని మొక్కులు చెల్లించుకుంటారని, అదేరోజు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.