అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పించడంతోనే జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు సిద్దిపేట అతిథ్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని ఫుట్‌బాల్ స్టేడియంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.11 కోట్లతో క్రీడా కాంప్లెక్స్ ఆభివృద్ధి చేశామన్నారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబర్చాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
సిద్దిపేట, డిసెంబర్ 28: సిద్దిపేట పట్టణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 16 రకాల క్రీడలకు సంబంధించిన మైదానాలు, కోర్టులు, సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు అతిథ్యం ఇవ్వడం జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని ఫుట్‌బాల్ స్టేడియంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సిద్దిపేట ఫుట్‌బాల్ స్టేడియం అద్భుతంగా చేసుకున్నామని, రూ.11కోట్లతో క్రీడా కాంప్లెక్స్ అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయిలో రాణించాలన్నారు. సిద్దిపేట, రాష్ట్రం, దేశానికి మం చిపేరు తేవాలని క్రీడాకారులకు సూచించారు. ప్రతిఒక్కరికీ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమన్నారు. విద్యతోపాటు క్రీడల్లో పోటీతత్వం అలవర్చుకోవాలన్నారు. పాఠశాలల స్థాయికే పరిమితమైన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు పంపేలా సిద్దిపేటలో అన్నిరకాల క్రీడాసౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. స్విమ్మింగ్‌ఫూల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్ బాల్ సెలెక్షన్స్, రంగనాయకసాగర్ వద్ద జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు సిద్దిపేట వేదికైందన్నారు.
నేడు సిద్దిపేట స్పోర్ట్స్ హబ్‌గా మారిందన్నారు, ఫ్లడ్ లైట్ల వెలుగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. క్రికెట్ స్టేడియాన్ని రూ.4కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. రూ.5 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసుకున్నామని, స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటు చేయబోతున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే రూ.50లక్షలతో వాలీబాల్ స్టేడియాన్ని తయారు చేసుకున్నామని, రూ. 50లక్షలతో స్టేడియాన్ని మరింత ఆధునీకరించనున్నట్లు తెలిపారు. రూ.2కోట్లతో ఫుట్‌బాల్ స్టేడియాన్ని అద్భుతంగా తయారు చేసుకొని అందుబాటులో తెచ్చామన్నారు. ఇటీవల జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై జమూకశ్మీర్‌లో ఆడిన అబ్దుల్ సమద్‌ను, రాష్ట్రస్థాయిలో ఎంపికైన శివగణేశ్‌ను అభిందించారు. కార్యక్రమంలో సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాలసాయిరామ్, ఫుట్‌బాల్ అసోసియేషన్ బాధ్యులు అక్బర్, వివిధ క్రీడా అసోసియేషన్ల బాధ్యులు మల్లికార్జున్, హరీశ్ పాల్గొన్నారు.