BRS Protest | రాయపోల్, అక్టోబర్ 8 : విద్యుత్ కోతలు, వ్యవసాయానికి సరఫరాలో అంతరాయాలపై సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం రాయపోల్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించి నిరసన చేపట్టారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి సుమారు 3 గంటలపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విద్యుత్ కోతల కారణంగా రైతులు పంటలకు నీరందించలేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆరోపించారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ ఏడీఏ మధుసూదన్ అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులతో చర్చించారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను పరిశీలించి పరిష్కరించడంతోపాటు రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అధికారుల హామీతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన విరమించారు. 3 గంటలపాటు సాగిన ధర్నా, రాస్తారోకోతో రాయపోల్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేకుల నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి యాదగిరి, మంతూర్ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు హనుమండ్ల రాజిరెడ్డి, ఇప్పటి దయాకర్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, మండల యూత్ అధ్యక్షులు గల్వా దయాకర్ రెడ్డి, మండల నాయకులు కొత్తపల్లి సత్యం, రాజేశ్వర్ రెడ్డి, లింగం, బెస్తా వెంకట్, భార్గవ్, బుజ్జి, శ్రీధర్, మురళి గౌడ్, నవీన్ గౌడ్, ఇస్తారి, నగేష్, తిరుపతి నర్సింలు, కిషన్, రాగి చంద్రం, బాగిరెడ్డి, జగపతి రెడ్డి, మధు, గణేష్, వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

