సంక్రాంతి అంటేనే ‘సంబురం’! లోకానాకి వెలుగునిచ్చే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభ
వేళను మకర సంక్రమణంగా అభివర్ణిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజులపాటు ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తారు. చలికాలం, వేసవి కాలానికి మధ్య ఉండే సంధి కాలంలో వచ్చే ఈ పండుగను తెలుగు నాట హిందూ సంప్రదాయ కుటుంబాలన్నీ విశిష్టమైనదిగా భావిస్తారు. అందుకే సంక్రాంతి పండుగ వచ్చే ఓ లచ్చాగుమ్మాడి.. అంటూ ఆనంద డోలికల్లో మునిగి తేలియాడుతోంది తెలుగు ప్రజ!
రామాయంపేట్/మెదక్ మున్సిపాలిటీ/మెదక్ రూరల్/పెద్దశంకరంపేట్/ న్యాల్కల్ జనవరి 13 : గోధూళి వేళ భోగి మంటల కాంతులు సరికొత్త అనుభూతి పంచనున్నాయి. ముత్యాల ముగ్గుల చీరలో ముంగిళ్లు సిగ్గులొలకనున్నాయి. గొబ్బెమ్మలు తెలుగింటి గొప్పదనాన్ని చాటి చెప్పనున్నాయి. తలపై భోగి పండ్ల వాన కురిసే వేళ బుడతల మనసులు మురవనున్నాయి. డూడూ బసవన్నలు అయ్యగార్లకు దణ్ణం పెట్టనున్నాయి. హరిదాసుల కీర్తనలు అందరి హృదయాలను రంజింపజేయనున్నాయి. ముచ్చటైన మూడు రోజుల పండుగతో పల్లెలన్నీ సందడిగా మారనున్నాయి. కొత్త అల్లుళ్లు, బంధువుల రాకతో హిందూ సంప్రదాయ లోగిళ్లు సంబురపడనున్నాయి. జిల్లాలో సంక్రాంతి వేడుక ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా వస్తుండడంతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.
మెదక్ మున్సిపాలిటీ, చేర్యాల, హుస్నాబాద్ రూరల్, జనవరి 13: సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణం ఆరంభమవుతుంది. ఈ శుభ సందర్భంలో నిర్వహించేదే సంక్రాంతి. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులపాటు జరుపుతారు. చలికాలం, వేసవి కాలానికి మధ్య ఉండే సంధికాలంలో వచ్చే ఈ పండుగ రైతులకు కూడా ప్రత్యేకమైనది. పంటల ఉత్పత్తుల విక్రయాలు జరిగి రైతుముఖాల్లో ఆనందాలు కనిపించే సందర్భంలో ఈ పండుగ ఘనంగా నిర్వహిస్తారు.
భోగభాగ్యాల భోగి
దక్షిణాయణం దేవతలు నిద్రించే కాలం. దీంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడల నివారణకు వీధుల్లో భోగి మంటలు వేసి ఇంట్లోని పాత వస్తువులను ఆహుతి చేస్తారు. మరుసటి రోజు నుంచి కొత్త వస్తువులను వినియోగిస్తారు. భోగి రోజు తెల్లవారు జామున పిల్లలకు తలస్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, నువ్వులు, నాణేలు, అక్షింతలు తలపై పోస్తారు. దీంతో చిన్నారులకు మంచి జరుగుతుందని నమ్మకం. భోగి రోజే గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం చేసుకుందని, అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలతో విరాజిల్లిందని ప్రతీతి. భోగి రోజున మహిళలు వాకిళ్లలో కల్లాపి చల్లి ముగ్గులు వేస్తారు. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరిక, జొన్న, శనగ, కుసుమ వంటి మొక్కలు, నవధాన్యాలు, జీడిపండ్లు, రేగుపండ్లు ఉంచుతారు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి తమ ఇళ్లకు వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.
మకర సంక్రాంతి
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈరోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదులుతారు. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం, గుమ్మడికాయలను దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో చేసిన పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు.
కనుమ
మూడో రోజు జరుపుకొనే పండుగ కనుమ. కనుమ అంటే పశువు అని అర్థం. ఆ రోజు పశువులను అలంకరిస్తారు. వాటికి పిండి వంటలను తినిపిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి విందు భోజనాలు చేసి సంతోషంగా గడుపుతారు.
గంగిరెద్దులు, హరిదాసుల సందడి
హరిదాసుల హడావుడి తెల్లవారు జాము నుంచే మొదలవుతుంది. గంగిరెద్దులవాళ్లు బసవన్నలను ఆడిస్తూ, విన్యాస్తాలు ప్రదర్శిస్తూ సందడి చేస్తుంటారు. బసవన్నలను పసుపు కుంకుమతో పూజించి వస్ర్తాలు సమర్పిస్తారు ప్రజలు.
ముగ్గులు.. గొబ్బెమ్మలు
సంక్రాంతి వచ్చిందంటే ప్రతి వాకిలి ఓ పూదోటను తలపిస్తుంది. ఆడబిడ్డలు ముగ్గులు వేసేందుకు పోటీ పడుతారు. రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి, పూలు, పండ్లు, నవ ధాన్యాలతో అలంకరిస్తారు. ఇంటింటా బొమ్మల కొలువులు పెడుతారు. ముత్తైదువలు సంక్రాంతి నోములు నోచుకుని తోటి సుహాసినులకు కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు.
వ్యవసాయ కుటుంబాల్లో ‘కాటిరావలు’
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. ఈ నెల 14, 15, 16వ తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు నిర్వహించనున్నారు. దీంతో పల్లెల్లో సంక్రాంతి కళ ఉట్టిపడుతున్నది. ఇంటింటా పిండి వంటలు ఘుమఘుమలాడుతున్నాయి. పండుగ నేపథ్యంలో జిల్లాలోని వివిధ మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. జీడి, రేగుపండ్లు, పిడకలు, ఆవుపేడ, గొబ్బెమ్మలు, వివిధ రకాల రంగులు, మట్టి పాత్రలు, గరిక, బంతిపూలను విక్రయిస్తున్నారు.
కాటిరావలు…
రైతులు కాటిరావల పండుగను ప్రత్యేకంగా చేస్తారు. తమ పశువుల పాక వద్ద ఈ పండుగను జరుపుకొంటారు. తమ పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు జాజును పూసి అందంగా అలంకరిస్తారు. పరమానాన్ని తయారుచేసి సాయంత్రం వేళలో పశువుల చుట్టూ తిరుగుతూ వేస్తారు. ఇష్ట దైవానికి నైవేద్యం సమర్పిస్తారు. గొడ్డు, గోదా చల్లంగా ఉండాలని మొక్కుకుంటారు. అనంతరం కోళ్లు, యాటల బలి కార్యక్రమం ఉంటుంది.