జహీరాబాద్, అక్టోబర్ 08 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా దవాఖానలో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హాస్పిటల్ మొత్తం అంధకారంలోకి జారుకుంది. కరెంటు పోవడంతో వార్డుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కరెంటు పోయిన వెంటనే ఆటోమేటిక్ గా జనరేటర్ పనిచేయాల్సి ఉండగా అది కూడా మొరాయించింది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న రోగులు భయాందోళనకు గురయ్యారు.
వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న సహాయకులు చేసేదేమీ లేక తమ సెల్ ఫోన్ లైట్లను ఆన్ చేసి వార్డుల్లో నిలుచున్నారు. సెల్ ఫోన్ వెలుగులోనే రోగులకు సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన మరమతులు చేపట్టారు. ఎలక్ట్రీషియన్ సహాయంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.
అయితే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఆటోమేటిక్ జనరేటర్ తరచూ పనిచేయకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. జహీరాబాద్ డివిజన్ లోని ఐదు మండలాల ప్రజలు ఈ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.