పటాన్చెరు, డిసెంబర్ 21: మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న సంగారెడ్డి జిల్లాలో నిత్యం నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. నిందితులు నిషేధిత మత్తు పదార్థాలను జిల్లా నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆంధ్రా-ఒడిశా(ఏవోబీ) బార్డర్ నుంచి సంగారెడ్డి జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలుతున్నది. తరుచూ పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న కేసుల్లో ఈ విషయం తెలుస్తున్నది. తాజాగా శనివారం న్యూ ఇయర్ వేడుకల కోసం ముంబయి నుంచి తెస్తున్న ఎండీఎంఏ డ్రగ్‌ను తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. శనివారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ చైతన్య కేసు వివరాలు మీడియాకు వెల్ల్లడించారు.
ఇస్నాపూర్‌లో శుక్రవారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేయగా, వారి వద్ద కేజీ నిషేధిత ఎండీఎంఏ డ్రగ్ పట్టుబడింది. పట్టుబడిన మహమ్మద్ సలీం అలియాస్ హమీద్ షేక్(30), ముఖేష్ దూబే(30) ముంబయి వాసులుగా గుర్తించారు. ఢిల్లీలో జేమ్మి, జిన్న అనే ఇద్దరు నైజీరియన్ల వద్ద ఈ డ్రగ్‌ను కొన్నట్లు వారు చెప్పారు. ఈ డ్రగ్‌ను హైదరాబాద్‌లో జరిగే న్యూ ఇయర్ ఈవెంట్లకు సరఫరా చేసేందుకు షేక్ ఆమేర్ అనే వ్యక్తికి అమ్మేందుకు తెచ్చామన్నారు. వీరితోపాటు ముంబయికి చెందిన రహీజ్ఖాన్ అనే వ్యక్తి కూడా నిషేధిత డ్రగ్స్ వ్యాపారం చేస్తాడని తెలిపారు.
ఇద్దరిని అరెస్టు చేసి రూ.కోటి విలువైన డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారి వద్ద నుంచి 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు నైజీరియన్లను పట్టుకోవాల్సి ఉందని, షేక్ ఆమేర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి సంగారెడ్డి కోర్టుకు హాజరు పరుస్తున్నామని ఎస్పీలు వెల్లడించారు. సమావేశంలో నార్కోటిక్ విభాగం అడిషనల్ ఎస్పీ సీతారాం, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ వినాయక్‌రెడ్డి, సీఐ రాజు, నార్కోటిక్ డీఎస్పీ శ్రీధర్, ఎస్ఐలు ఆసీఫ్ అలీ, అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
15 రోజుల్లో రూ.4.40 కోట్ల డ్రగ్స్ పట్టివేత: నార్కోటిక్ ఎస్పీ
అసాంఘిక శక్తులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నార్కోటిక్ విభాగం ఎస్పీ చైతన్య సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర నిషేధిత డ్రగ్స్‌ను గుర్తిస్తే నార్కోటిక్ బ్రాంచ్ ఫోన్ నెంబర్ 87126 56777కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. 15 రోజుల్లో 641 కేజీల గంజాయి, 16 కిలోల గంజాయి చాకెట్లు పట్టుకున్నట్లు తెలిపారు. 1600 గ్రాముల హాష్ ఆయిల్‌ను, ఎండీఎంఏ 1కేజీ 300 గ్రాములు, ఓపీఎం కేజీ, వోజీ 97 గ్రాములు, చరస్ 115 గ్రాములు, స్ట్రా 53 కేజీలు, హెరాయిన్ 44 కేజీలు పట్టుకున్నట్లు చెప్పారు. మొత్తంగా రూ.4.40 కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టుకున్నట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని, ఇన్ఫార్మర్ వ్యవస్థ సాయంతో దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో డీజేలపై, ఈవెంట్ మేనేజెమెంట్లపై నిఘా ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.