సంగారెడ్డి కలెక్టరేట్, మే 17: ఆరుకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను విధిగా వెళ్లి పరిశీలించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ ఏరియా ఓటర్ జాబితాకు సంబంధించి వివిధ అంశాలపై ఆర్డీవో, పటాన్చెరు, ఆర్సీ పురం తహసీల్దార్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే ఇంట్లో నివాసముంటూ వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఓటరుగా నమోదైన వారి జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఎక్కువ ఓటర్లు ఉన్న చోట అవసరమైతే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 13 కేటగిరీల్లో బీఎల్వోలను నియమించినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో 363 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 109 ఉన్నాయన్నారు. 2018 ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 71.52 శాతం ఓటరు టర్న్ అవుట్ నమోదైందన్నారు. పెద్దఎత్తున స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని ఏఈఆర్వోలకు సూచించారు. పటాన్చెరు నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న 7355 ఇళ్లలో 6875 ఇళ్లు పరిశీలించడం పూర్తయిందన్నారు. మరో 480 ఇళ్లను త్వరితగతిన పరిశీలించాలని సంబంధిత ఏఈఆర్వోలను ఆదేశించారు. 1500 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేశ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
మురుగు నీరు పారకుండా చేయాలి
జాతీయ రహదారి 65పై కందిలో ఓవర్ ఫ్లో అవుతున్న మురుగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ పంచాయతీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్‌తో కలిసి జాతీయ హైవే అధికారులు, మున్సిపల్, పంచాయతీ, ఆర్అండ్బీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంది గ్రామం నుంచి జాతీయ రహదారిపై పారుతున్న డ్రైనేజీని పరిశీలించి శ్మశాన వాటిక దగ్గర ఉన్న నాలా వరకు మురుగు కాల్వ నిర్మించాలని ఆదేశించారు. జాతీయ రహదారి వయా పోతిరెడ్డిపల్లి పోలీస్‌స్టేషన్ పీఎన్ఆర్ కాలనీ కమాన్ వద్ద పారుతున్న మురుగునీటిని అరికట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.