మెదక్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల నివారణకు మెదక్ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనుందని తెలిపారు. ముఖ్యంగా జనసంచారం అధికంగా ఉండే జంక్షన్లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం, వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించడం, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం వంటి అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వనున్నారని తెలిపారు.
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడినా.. మద్యం సేవించిన వాహనం నడిపినా.. రాంగ్ రూట్లో ప్రయాణించినా.. ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.