న్యాల్కల్, జనవరి 10: రేజింతల్ సిద్ధివినాయక ఆలయం భక్తజన సంద్రమైంది. అంగారక సంకష్ట హర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, యాగం తదితర పూజలను నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్, జోగిపేట్, మనూర్, సంగారెడ్డి, సదాశివపేట్, ఝరాసంగం, రాయికోడ్ తదితర ప్రాంతాల నుంచి కాలి నడకన తరలివచ్చిన భక్తులతో జహీరాబాద్, బీదర్, అల్లాదుర్గం రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఆయా మార్గాల్లో పలువురు దాతలు షామియానాలు వేసి భక్తులకు అల్పాహారం, తేనీటి సేవలు అందజేశారు. స్వామివారి పల్లకీ సేవ కన్నుల పండువగా సాగింది.
మహారాష్ట్ర భజన భక్తులు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భజన కార్యక్రమం అందరిలో భక్తిభావాన్ని ప్రేరేపించాయి. భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్, బీదర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపారు. జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధర్యంలో సీఐ వెంకటేశ్, హద్నూర్, రాయికోడ్, ఝరాసంగం ఎస్సైలు వినయ్‌కుమార్, ఏడుకొండలు, రాజేందర్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు. మిర్జాపూర్ (బి) పీహెచ్సీ డాక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ డాక్టర్ శరత్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు అల్లాడి వీరేశం, అధ్యక్షుడు రేజింతల్ ఆశోక్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింహులు, సభ్యులు, మేనేజర్ కృష్ణ, ఆలయ పూజారులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవర సిద్ధివినాయక జయంత్యుత్సవాలు
మండలంలోని హద్నూర్ శివారులో స్వయంభువుగా వెలిసిన శ్రీవరసిద్ధి వినాయక స్వామి 223వ జయంతి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో వేద పండితులు పలు విశేష పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భజన కీర్తనలు కొనసాగాయి. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాశ్, కేతకీ సంగమేశ్వర చైర్మన్ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు పాండురంగారెడ్డి, రాజ్‌కుమార్, చంద్రప్ప, స్థానిక సర్పంచ్ వీరామణి, ఆలయ కమిటీ అధ్యక్షుడు గణేశ్ దీక్షిత్, నాయకులు పాల్గొన్నారు.