కోహీర్, ఫిబ్రవరి 21: ఐదు వందల ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బడంపేటలో ఆహ్లాదకర వాతావరణంలో కొలువుదీరిన రాచన్నస్వామి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా జిల్లాలో పేరుగాంచిన బడంపేట రాజన్న స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్రతోపాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
బడంపేట ఆలయ చరిత్ర..
అనంతపూర్ జిల్లా రాయచోటి నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని బడంపేటలో ప్రతిష్ఠించినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఐదు వందల సంవత్సరాల క్రితం పసిబాలుడి రూపంలో బడంపేట అటవీ ప్రాంతంలో రాచన్నస్వామి నడయాడాడు. ఆలయానికి కిలోమీటర్ దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న అయ్యగవిలో తపస్సు చేసినట్లు చరిత్రలో పేర్కొని ఉంది. బాలుడి అవతారంలో ఉన్న రాచన్నస్వామి గంధం, పొన్న చెట్టుపై ఆటలాడుతుండగా పశువుల కాపరి చూసి చెట్టుపై నుంచి కిందకు దిగాలని బతిమిలాడాడు. కానీ అతని మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. తనకేమీ కాదని సమాధానమిచ్చాడు. చెట్టుపై ఉన్న బాలుడిని తమ గ్రామానికి రావాలని మరోసారి వేడుకున్నాడు.
అందుకు తాను గ్రామానికి వస్తాను.. కానీ బాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లాలని సూచించాడు. గ్రామానికి వెళ్లే సమయంలో ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని కోరాడు. అందుకు పశువుల కాపరి సరే అని అక్కడి నుంచి వెళ్లి గ్రామపెద్దలకు విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. అందరూ అటవీ ప్రాంతానికి వెళ్లి బాలుడి రూపంలో ఉన్న స్వామిని తీసుకువస్తుండగా గ్రామ సమీపానికి రాగానే కొందరు వెనుకకు తిరిగి చూశారు. దీంతో బాలుడి రూపంలో ఉన్న రాచన్నస్వామి ఒక్కసారిగా లింగాకారంలోకి మారిపోయాడు. దీంతో అప్పటి నుంచి శివ లింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. ఆలయాన్ని నిర్మించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అనంతరం రాచన్నస్వామికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
అపరవీర భద్రావతారంలో దర్శనం..
పరమేశ్వరుడు ఇక్కడ అపర వీర భద్రావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భద్రకాళీ సమేతంగా కొలువుదీరాడు. ఆలయంలో అన్నపూజలు, గండదీపాలు, పుట్టువెంట్రుకలు, వివాహాది కార్యక్రమాలు ఇక్కడ తరుచూ నిర్వహిస్తున్నారు. రాచన్నస్వామి ఆలయ సమీపంలో మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. ప్రధాన ఆలయం వెనుక భాగంలో అమృత గుండం ఉంది. అందులో స్నానమాచరిస్తే పాపాలు తొలిగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
24వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు..
బడంపేట రాచన్నస్వామి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పాల్గుణ శుద్ధ పంచమిని పురస్కరించుకొని శుక్రవారం తంగడపల్లి ఆశ్రమ పీఠాధిపతి గురుగంగాధర మహాస్వామి ఈ బ్రహోత్సవాలు ప్రారంభించనున్నారు. ఉదయం ఐదు గంటలకు ధ్వజారోహణం, శిఖరపూజ, రాచన్నస్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, మహామంగళహారతి తదితర పూజలు ఉంటాయి. రాత్రి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపడతారు.
అనంతరం గంగాధరస్వామి ప్రవచనం, హరికథ, బుర్రకథ, భజనలు కొనసాగుతాయి. శనివారం ఉదయం స్వామి వారికి పల్లకీ సేవ, ప్రత్యేక పూజలు చేపడతారు. ఉదయం ఆరు గంటలకు అగ్నిలోకి ప్రవేశించి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం మహాస్వామి ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జహీరాబాద్‌కు చెందిన కౌలాస్ కుటుంబీకులు ఆదివారం ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, మహామంగళహారతి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు భద్రకాళిదేవి సహిత రాచన్నస్వామికి కల్యాణోత్సవాన్ని జరిపిస్తారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టనున్నారు.
ఉత్సవాలకు భక్తులు తరలిరావాలి..
24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బడంపేట రాచన్నస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలి.
-శివరుద్రప్ప, బడంపేట ఆలయ ఈవో
భక్తుల కోరికలు తీరుస్తాడు..
బడంపేటలో వెలిసిన రాచన్నస్వామికి అత్యంత మహి మ ఉన్నది. భక్తులు కోరిన కోర్కెలను తప్పకుండా తీరుస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలి. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని పరమేశ్వరుడి కృపను పొందాలి.
-జగదీశ్వర్‌స్వామి, బడంపేట ఆలయ అర్చకుడు