గుమ్మడిదల,(సంగారెడ్డి), జనవరి 11: నిషేధిత ఆల్ఫాజోలం డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం సంగారెడ్డిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు ఎస్పీ చెన్నూరి రూపేశ్ వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 31న గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు చేసిన విచారణలో జిన్నారం, గుమ్మడిదల, సీసీఎస్ పోలీసులు నిజాలను బయటకు తీశారు. ఈ దందాలో ముత్తంగికి చెందిన గిర్మగౌని సుధీర్గౌడ్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం సాయం త్రం గిర్మగౌని సుధీర్‌గౌడ్ తన కారులో ముత్తంగి నుంచి మెదక్ వెళ్తున్న పోలీసులు గుర్తించి, అతని వాహనాన్ని మంభాపూర్ గేట్ వద్ద పట్టుకుని విచారించారు.
విచారణలో సుధీర్‌గౌడ్ తన నేరాన్ని అంగీకరించి, ఆల్ఫాజోలం విక్రయించేందుకు మెదక్ వెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. ముత్తంగిలోని తన్మయి హోమ్స్‌లో ఉండే ఏ1 గిర్మాగౌని సుధీర్‌గౌడ్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. స్వస్థలం మెదక్ జిల్లాలోని పిట్లంబేస్. జీవనోపాధి కోసం బీరంగూడలో నివాసం ఉంటూ డబ్బు సంపాదన మీద దురాశతో 2017లో కానుకుంటకు చెందిన విశాల్‌గౌడ్ అనే వ్యక్తితో పరిచయం చేసుకున్నాడు. అతని నుంచి ఆల్ఫాజోలం తీసుకుని తన భార్య, తమ్ముడితో కలిసి విక్రయించేవాడు. 2020లో గుమ్మడిదలకు చెందిన సాయిగౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని నుంచి ఆల్ఫాజోలం కొని అమ్మేవాడు.
ఆ తర్వాత విశాల్‌గౌడ్ ముత్తంగికి చెందిన భీశ్వేశ్వర్సింగ్ను పరిచయం చేయగా, అప్పటి నుంచి వీరందరూ కలిసి ఈ నిషేధిత ఆల్ఫాజోలం వ్యాపారం చేస్తున్నారు. కమీషన్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో అధిక లాభాలను చూడాలని సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. బీశ్వేశ్వర్సింగ్కు ఆల్ఫాజోలం తయారు చేసే పద్ధ్దతి తెలుసని, సొంతంగా ఆల్ఫాజోలంను తయారు చేసి అధిక డబ్బును సంపాదించవచ్చని 2023లో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామ శివారులో సర్వేనంబర్ 39 గల సాయిప్రియ కెమికల్స్ కంపెనీని కొనాలని లక్ష్మణ్‌గౌడ్ నిర్ణయించుకున్నారు.
ముత్తంగికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేశ్వర్శర్మను బీశ్వేశ్వర్సింగ్ పరిచయం చేయగా, ముగ్గురు కలిసి 2023 మేలో లక్ష్మణ్‌గౌడ్ కంపెనీని కొనుగోలు చేశారు. ఆ కంపెనీలో నిషేధిత ఆల్ఫాజోలం తయారుచేసే యంత్రాలను ఏర్పాటు చేశారు. సుధీర్‌గౌడ్ తన డ్రైవర్ బోడ శశికుమార్ సహాయంతో ఆల్ఫాజోలం తయారీకి కావాల్సిన ముడిపదార్థాలను కొనుగోలు చేస్తుండేవారు. ఒక బ్యాచ్‌కు 50 కిలోల చొప్పున నెలకు 1-2 బ్యాచ్‌ల ఆల్ఫాజోలం తయారుచేసి కేజీ రూ.4 లక్షల చొప్పున హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో విక్రయించి డబ్బులు సంపాదించేవారు. వీరిని జిన్నారం, గుమ్మడిదల, సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పూర్తి ఆధారాలతో పట్టుకున్నారు.
ఏ1గా గిర్మగౌని సుధీర్‌గౌడ్(ముత్తంగి), ఏ2 గా భీశ్వేశ్వర్సింగ్(రామరాజు నగర్, ముత్తంగి), ఏ3గా రాజేశ్వర్‌శర్మ (పటాన్చెరు,ముత్తంగి) , ఏ4గా గిర్మాగౌని శ్రీవాణి (తన్మయిహోమ్స్, ముత్తంగి), ఏ5గా బోడ శశికుమార్(బీరంగూడ)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.వీరి నుంచి 740 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలం, 3 కార్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీరి వద్ద సుమారు రూ.60 కోట్ల విలువ గల ఆస్తులు గుర్తించారు. అందరినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించినట్లు ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే వెంటనే సంగారెడ్డి జిల్లా పోలీసులకు, ఎస్-న్యాబ్ నంబర్ 87126 56777కు సమాచారం అందించాలని సూచించారు. డ్రగ్స్ ముఠాను పట్టుకోవడానికి కృషిచేసిన పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, జిన్నారం సీఐ నియీముద్దీన్, గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్‌రెడ్డి, సీసీఎస్ ఎస్సై శ్రీకాంత్, సిబ్బందిని ఎస్పీ రూపేశ్ అభినందించారు.