సిద్దిపేట, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి తో సిద్దిపేట ప్రాంతం ఆయిల్‌పామ్ తోటలకు అడ్డాగా మారింది. సిద్దిపేట జిల్లాలో గడిచిన ఐదేండ్లలో వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ తోటలు సాగుచేశారు. తొలి ఏడాది సాగుచేసిన రైతుల పంట చేతికి వచ్చింది. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది.
నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ భవిష్యత్తులో సిద్దిపేటకే కాకుండా జన గాం, మహబూబాబాద్, గద్వాల, నారాయణపేట, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల ఆయిల్‌పామ్ గెలలను ప్రాసెస్ చేయుటకు అత్యాధునిక సామర్ధ్యంతో మలేషియా టెక్నాలజీతో ఫ్యాక్టరీని నిర్మించారు.కాయల నుంచి వచ్చే పీచుతో పరుపులను తయారుచేస్తారు. వ్యర్ధాలతో చేపలకు ఎరువు, బయోగ్యాస్‌కు ఉపయోగిస్తారు. నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఇక్కడి రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షం గా రెండు వేల మందికి పైగా ఉపాధి కలగనున్నది.
ఆయిల్‌పామ్ మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30 ఏండ్ల వరకు నిరంతర దిగుబడితో రైతులకు ఆదాయం వస్తుంది.సాంప్రదాయ నూనెగింజల కంటే ఆయిల్‌పామ్ నూనె దిగుబడి 5 రెట్ల వరకు అధికంగా వస్తుంది. తెగుళ్లు, చీడపీడల బెడద ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌లో చాలా తక్కువ. తుఫాన్, వడగండ్ల, వానలు, ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతగా తట్టుకుంటుంది. కోతులు, అడవి పందుల బెడద ఉండదు. ఇతర పంటల మాదిరిగా ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పార పట్టడం, తేమ శాతం నిలవడం లాంటి సమస్యలు ఆయిల్‌పామ్‌లో ఉండవు.
దళారీ వ్యవస్థ ఉండదు. రైతు గెలలు కోసిన తర్వాత నేరుగా ఫ్యాక్టరీకి తరలించి మూడు రోజుల్లో గెలలు, రవాణా చార్జీలు పొందే అవకాశం ఉంటుంది.ఆయిల్ పామ్ సాగుతో నిరంతర దిగుబడి, ఆదాయంతో రైతుల ఆర్థిక పురోగతికి దోహదం చేయనున్నది. ఇతర పంటలతో పొలిస్తే ఖర్చుల పోను ఆయిల్‌పామ్ సాగుతో ఏడాదికి ఎకరాకు నికరంగా రూ.1,00, 000లు ఆదాయం మిగులుతుంది. మొదటి మూడేండ్లు ఆదాయం కోసం అంతర పంటలుగా కూరగాయలు, మొక్కజొన్న ,పత్తి , బెబ్బర్లు, పెసర్లు, కందులు, ఉలువలు పొద్దుతిరుగుడు, అరటి, బొప్పాయి, వేరుశనగ లాంటి పంటలు పండించవచ్చు. ఐదేండ్ల తర్వాత కోకో, పొట్టి మిరియాలు మొదలగు పంటలను ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలుగా సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
సిద్దిపేట జిల్లాలో 2021-22లో 655 మంది రైతులు 2763 ఎకరాల్లో, 2022-23 లో 1717 మంది రైతులు 5556 ఎకరాల్లో 2023-24లో 967 మంది రైతులు 2786 ఎకరాల్లో 2024-25 లో 335 మంది రైతులు 1207 ఎకరాల్లో 2025-26లో 377 మంది రైతులు 1108 ఎకరాల్లో, మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు 4,051 మంది రైతులు 13,420 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగుచేశారు. 820 మంది రైతులు తమ 2350 టన్నుల పంటను అమ్ముకున్నారు. ఇందుకు దాదాపుగా రూ. 4 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 72,854 మంది రైతులు 2,70,223 ఎకరాల 27 గుంటల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. 2024- 25 వరకు రాష్ట్రంలో 66,649 మంది రైతులు 2,43,498 ఎకరాల 27 గుంటలు సాగుచేయగా, 2025-26( ఇప్పటి వరకు) సంవత్సరంలో 8,201 మంది రైతులు 26,662 ఎకరాలు సాగుచేశారు.
మిరుదొడ్డి, సెప్టెంబర్ 24 : ఇతర పంటల కంటే ఆయిల్‌పామ్ పంట సాగు అన్నివిధాలా నయముంది. నేను మూడెకరాల్లో ఆయిల్‌పామ్ తోటను పెట్టాను. అంతర పంటలు వేసుకోవడంతో ఆదాయం వచ్చింది. ఆయిల్‌పామ్ పంట చేతికి రావడంతో ఎకరాకు నాకు రూ.2 లక్షల వరకు డబ్బులు చేతికి వచ్చాయి. మొత్తం 3 ఎకరాల్లో కలిపి రూ.6 లక్షల ఆదాయం వచ్చింది.ఈ పంటకు కొతుల బెడద లేదు.
-తోట అంజిరెడ్డి, రైతు, మిరుదొడ్డి (సిద్దిపేట జిల్లా)
సిద్దిపేట, సెప్టెంబర్ 24: ఆరు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ చెట్లను నాలుగేండ్ల క్రితం నాటాను. తర్వాత మరో రెండెకరాలు సాగుచేశాను. నాకు మొదటి క్రాప్‌గా 8 టన్నుల ఆయిల్‌పామ్ గెలులు కోశాను. జూన్ 12 మొదటి పంటను కోశాను. 8 టన్నులకు రూ.1.30 లక్షల ఆదాయం వచ్చింది. అంతర్ పంట లుగా మొక్కజొన్న, పత్తి, ను వ్వులు, బెబ్బెర సాగు చేశాను.వాటి ద్వారా రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. మా గ్రామంలో చాలామంది రైతులు ఆయిల్‌పామ్ పంట సాగుచేశారు. -ఒగ్గు బాలకృష్ణ, రైతు, గోపులాపూర్, సిద్దిపేట జిల్లా
సిద్దిపేట, సెప్టెంబర్ 24: నేను లింగారెడ్డిపల్లిలో రెండెకరాలు, నంగునూరు మండలం కోనాయిపల్లిలో 8ఎకరాలు ఆయిల్‌పామ్ సాగు చేశా. లింగారెడ్డిపల్లిలో రెండెకరాల్లో మొదటి క్రాప్ కోశాను. 5 క్విం టాళ్ల దిగుబడి వచ్చింది. రెండో క్రాప్ కోయగా 3క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడి పోను రూ.22 వేల ఆదాయం వచ్చింది. అంతర్ పంటలుగా మొక్కజొన్న , ఆకుకూరలు, పెసర, బెబ్బర, కర్బుజా పం టలు సాగు చేయగా అదనపు ఆదాయం సమకూరింది. ఈ పంట సాగుతో లాభాలు ఉన్నాయి. -నిమ్మ కనకారెడ్డి, రైతు, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట జిల్లా
గజ్వేల్, సెప్టెంబర్ 24: మొదట్లో ఐదెకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేశాను. మరుసటి ఏడాది మరో పదెకరాల్లో సాగు చేశాను. మొదట సాగు చేసిన ఐదెకరాల్లో నాలుగు సార్లు కాత కోయడంతో ఇప్పటి వరకు రూ.2 లక్షలు వచ్చాయి. పదెకరాల్లోని ఆయిల్‌పామ్ వచ్చే ఏడాది కాతకొస్త్తది. ఈసారి కాతలు కోయడంతో మంచి దిగుబడి వచ్చింది. ప్రభుత్వం టన్నుకు రూ.25వేలు చెల్లిస్తే మరిం త మంది సాగు చేసేందుకు ముందుకొస్తారు. మాజీమంత్రి హరీశ్‌రావు ప్రోత్సహించడంతోనే రైతులు ఆయిల్‌పామ్ సాగు చేశారు.
-రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, రైతు, దౌలాపూర్, జగదేవపూర్ మండలం, సిద్దిపేట జిల్లా
హుస్నాబాద్, సెప్టెంబర్ 24: నేను 2021 నవంబర్‌లో ఆరెకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేసిన. ఇటీవల పంట దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 24 టన్నుల పంటను అమ్మిన. రూ.3 39,000 ఆదాయం వచ్చింది. ఈ పంట సాగు చేసినందుకు సబ్సిడీపై డ్రిప్, మొక్కలు ఇచ్చారు. అంతర పంటల సాగు కోసం ఎకరానికి రూ.4, 200 లు ఇచ్చారు. అంతర పంటలు సాగు చేసి లాభాలు పొందిన. నర్మెట్ట శివారులో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది.
-కర్ర ఉపేందర్‌రెడ్డి, రైతు, అక్కన్నపేట,సిద్దిపేట జిల్లా
గజ్వేల్, సెప్టెంబర్ 24: అంతర పంటల సాగుచేస్తే మంచి లాభాలు వచ్చాయి. నాలుగేండ్ల క్రితం నాలు గెకరాల్లో ఆయిల్‌పామ్ తోట పెట్టిన మూడేండ్ల నుం చి పంట కాతకొచ్చింది. ఇప్పటికే ఐదు ఖాతలు కోసి అమ్మగా, రూ.1.2 0లక్షలు వచ్చాయి. అంతర పంటగా మొదట కంది సాగు చేయగా, దాని ద్వారా రూ.2 లక్షల వచ్చాయి. మరుసటి ఏడాది పత్తి సాగు చేయగా, 40 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ఇప్పుడు పత్తి సాగు చేశాను. హరీశ్‌రావు సార్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించారు.
-మద్ది రాజిరెడ్డి, రైతు, అహ్మదీపూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట
దుబ్బాక, సెప్టెంబర్ 24 : మూడెకరాల్లో 172 ఆయిల్ పామ్ మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీరు అం దించా. నన్ను చూసి మా గ్రామంలో మరో 30 మంది రైతులు 200 ఎకరాలకు పైగా తోటలు వేశారు. మొదట మూడేండ్లు అంతర్ పంటగా ఆకుకూర లు,కూరగాయలు, పండ్ల తోటలను సాగుచేసి ఆదాయం పొందాను. ఇప్పుడు ఆయిల్‌పామ్ దిగుబడులు రావ డంతో మూడేండ్ల కష్టానికి ఫలితం వస్తున్నది. రూ.20 వేల వరకు ఆదాయం వచ్చింది. 35 ఎండ్ల వరకు ఢోకా లేదు. కేసీఆర్, హరీశ్‌రావు సార్లకు రుణపడి ఉంటాను.
– మహహ్మద్ గౌస్, రైతు ,హబ్షీపూర్,సిద్దిపేట జిల్లా