మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27: 2025-26 ఆర్థిక సంవత్సరానికి వందశాతం ఆస్తిపన్ను వసూళ్లే లక్ష్యంగా మెదక్ మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ ఆస్తి పన్ను చెల్లించేందుకు ఇక నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుండటంతో మున్సిపల్ అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి వసూళ్లను ముమ్మరం చేసినా అంతంత మాత్రమే వసూళ్లు కావడం గమనార్హం. ముఖ్యంగా మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను, నల్లా, ఇతర పన్నులే ప్రధానం. ఏటా భవన నిర్మాణాలు పెరుగుతుండటంతో ఆదే స్థాయిలో ఆస్తి పన్ను సైతం ఆదాయం రూపంలో పెరుగుతుంది. మున్సిపాలిటీలోని నివాసగృహాలు, దుకాణ సముదాయాల యజమానులు ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనెల 31 వరకు పన్నులు చెల్లించనివారి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డిమాండ్ నోటీసులు బకాయిదారులకు జారీ చేశారు. అత్యధిక బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మెదక్ పట్టణంలో నివాస గృహాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు కలిపి 12,915 ఉన్నాయి. వీటి ద్వారా రూ. 7కోట్ల45లక్షల ఆస్తి పన్ను రావాల్సి ఉంది. ఈనెల 23 తేదీ వరకు రూ.4 కోట్ల 33లక్షల 71వేలు మాత్రమే వసూళ్లు అయ్యాయి. ఇంకా రూ.3కోట్ల11లక్షల పైగా వసూళ్లు కావాల్సి ఉంది. ఆస్తి పన్నుతో పాటు బకాయిలు ఉన్న వారికి డిమాండ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినా పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు. అయినా స్పందించకుంటే వ్యాపార సముదాయాలైనా, నివాస గృహాలైనా సీజ్ చేస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నాలుగు రోజులే గడువు ఉండటంతో బల్దియా మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించింది. మొండి బకాయిదారులపై చర్యలు తీసుకునేందుకు వారి జాబితాను ఇదివరకే బల్దీయా తయారు చేసింది. ముఖ్యంగా మొండి బకాయిల దారులపై ప్రత్యేక శ్రద్ధ వహించి తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ 90002 53342ను నాలుగేండ్ల క్రితమే అందుబాటులోకి తెచ్చింది. దీంతో అటు మున్సిపల్ సిబ్బంది, ఇటు ఇంటి యజమానులకు సేవలు సులభతరం కానున్నాయి. 90002 53342 ద్వారా చాట్ చేసి ఆస్తి యజమానులు తాము చెల్లించాల్సిన పన్ను వివరాలు తెలుసుకొని పన్ను చెల్లించవచ్చు. ఈ నంబర్‌ను సెల్ఫోన్లో సేవ్ చేసుకొని క్లిక్ చేయగానే మున్సిపల్ శాఖ స్వాగత సమాచారం అందుతుంది. తెలుగు, ఇంగ్లిష్‌లో సమాచారం పొందే వీలు కల్పించారు.
వందశాతం పన్నుల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బృందాలు నియమించాం, ప్రణాళికాబద్ధంగా బకాయిలు వసూలు చేస్తున్నాం. ఇప్పటికే సుమారు 60 శాతానికి పైగా పన్ను వసూలు చేశాం. మిగతా బకాయిలను గడువులోగా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తిపన్ను చెల్లింపులో నివాస గృహ, దుకాణ సముదాయ యజమానులు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్, మెదక్ జిల్లా