న్యాల్కల్, సెప్టెంబర్ 21: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చాలామంది రైతులు తమ పంథా మార్చుకున్నారు. నిత్యం ఆదాయం సమకూర్చే పంటలపై దృష్టి సారిస్తున్నారు. బోరు సౌకర్యం ఉన్న రైతులు ఎక్కువగా చెరుకు, అల్లం, పసుపు, అరటి, మామిడి, ఉసిరి తదితర పంటలు పండిస్తున్నారు. ఎప్పుడూ సంప్రదాయ పంటలు సాగుచేసే బదులుగా ఆరుతడి పంటలు ఎంచుకుంటున్నారు.
పూలు, కూరగాయలకు భలే డిమాండ్
మార్కెట్లో పూలు, కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతులు ఆ పంటల సాగు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. వాతావరణానికి అనుకూలంగా ఆకుకూరలు, కూరగాయలతో పాటు పూల తోటలను సాగు చేస్తున్నారు. దీంతో వారికి ఈ పంట లు లాభలు తీసుకొస్తున్నాయి. న్యాల్కల్ మండలంలోని హద్నూర్, న్యాల్కల్, చీకూర్తి, చాల్కి, ఖలీల్పూర్, న్యామతాబాద్, రుక్మాపూర్, మిర్జాపూర్(ఎన్), ముంగి, మెటల్కుంట, గంగ్వార్, హుసేల్లి, మామిడ్గి, రాజోలా తదితర గ్రామాల్లోని రైతులు తమ పొలాలు, పాలీహౌజ్ల్లో బంతి, చామంతి, గులాబీ తదితర పూల తోటలు సాగు చేస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు పూల గిరాకీ బాగుంటుంది. ఈ పండుగలను దృష్టిలో పెట్టుకుని రైతులు అర ఎకరం నుంచి రెండు, మూడు ఎకరాల వరకు పూల మొక్కలు పెంచుతున్నారు. రెండు, మూడు, వారాలకు ఒకసారి పూలు తెంపి మార్కెట్లో విక్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన పూల వ్యాపారులు, పొలాల వద్దకే వచ్చి కొనుక్కుని తీసుకెళ్తున్నారు. ఇలా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. చాలామంది రైతులు పూలతో పాటు ఆకుకూరలు, కూరగాయల పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు వచ్చే పూల సాగును ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. మండలంలోని 320 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. 35 ఎకరాల్లో పూల తోటలు సాగవుతున్నాయి.
పూల సాగుతో లాభాల బాట
నాకున్న ఆరెకరాల్లో చెరుకు, పత్తితో పాటు ఎకరంలో బంతి పూలు పండిస్తున్నా. బంతి సాగు చేసేందుకు ఎకరాకు పెట్టుబడి రూ.30 వేల వరకు ఖర్చవుతున్నది. రోజూ డ్రిప్ ద్వారా బంతి తోటకు నీటిని అందిస్తున్నా. విత్తనం నాటిన మూడు నెలల్లోనే పూలు చేతికొస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో బంతిపూలు కిలోకు రూ.60 ధర పలుకుతున్నది. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు బంతిపూలకు డిమాండ్ ఉంటుంది. అప్పుడు కిలోకు రూ.100 పైగానే ధర పలికే అవకాశం ఉంటుంది. రెండేండ్లుగా బంతిపూలు పండిస్తున్నా. పూలసాగుతో ఎకరానికి సుమారు రెండు లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నా.
– జమునాబాయి, మహిళా రైతు, హద్నూర్ గిరిజన తండా