చకచకా మోడల్ రైతుబజార్ పనులు
భారతీనగర్ డివిజన్లో రూ.3 కోట్లతో నిర్మాణం
ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు
ఇప్పటికే మూడు షెడ్లు పూర్తి
ఒకే చోట వెజ్, నాన్‌వెజ్‌తో పాటు సరుకుల దుకాణాలు
త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు
రామచంద్రాపురం, మే15: జీహెచ్ఎంసీ భారతీనగర్ డివిజన్లోని ఎల్‌ఐజీలో రూ.3 కోట్లతో చేపడుతున్న మోడల్ రైతుబజార్ పనులు చకచకా సాగుతున్నాయి. మొత్తం నాలుగు షెడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, మూడు షెడ్ల పనులు పూర్తయ్యాయి. ఇంటర్నల్ వర్కులు జరుగుతున్నాయి. మోడల్ రైతుబజార్ పనులు పూర్తయితే భారతీనగర్, ఆర్సీపురం డివిజన్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎన్నో కొత్త కాలనీలు రావడంతో జనాభా పెరిపోయింది. ఇక్కడ వారాంతపు సంతలు మాత్రమే జరుగుతుండడంతో రోజువారీగా తాజా కూరగాయలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఒకేసారి వారం రోజులకు సరిపడా కూరగాయలను స్థానిక ప్రజలు తెచ్చుకొని నిల్వచేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలు భారతీనగర్ డివిజన్లో రైతుబజార్‌ను ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. దీంతో మోడల్ రైతుబజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి.
వీధి వ్యాపారం లేకుండా చర్యలు..
రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు ఉపయోగపడే విధంగా మోడల్ రైతుబజార్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. రోడ్డుమీద దుకాణాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది. మాంసం దుకాణాలు కూడా రోడ్డుకు పక్కనే ఏర్పాటు చేస్తుండడంతో స్థానికంగా ఉన్న దుకాణదారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో రైతుబజార్ నిర్మాణం చేపట్టి చిరువ్యాపారులు అందరూ రైతుబజార్లోనే వ్యాపారం చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రజలకు కూడా అన్ని వస్తువులు ఒకేచోట దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతుబజార్లో సకల సౌకర్యాలు..
మోడల్ రైతుబజార్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లతో పాటు పండ్లు, పప్పు దినుసుల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతుబజార్ నిర్మాణంలో భాగంగా నాలుగు పెద్ద షెడ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో షెడ్లో 41 దుకాణాలుంటాయి. దుకాణాలతో పాటు రైతు చిహ్నం, ఫుడ్‌కోర్టు, పార్కింగ్, రోడ్లు, టాయిలెట్స్, డ్రైనేజీ లైన్, వాటర్ డ్రైన్, చిన్నారుల కోసం ఆట సామగ్రి తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది..
రైతుబజార్ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. రోజువారీగా తాజా కూరగాయలు రైతుబజార్ నుంచి తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. వారాంతపు సంతలో కూరగాయలు ఒకేసారి తెచ్చుకొని స్టోరేజీ చేసుకోవాల్సి వస్తుంది. ఎల్‌ఐజీలో నిర్మిస్తున్న రైతుబజార్లో కూరగాయలు, పప్పులు, పండ్లు, మాంసం మార్కెట్లు ఏర్పాటవుతున్నాయని తెలిసి సంతోషంగా ఉంది. ఒకేచోట అన్ని వస్తువులు దొరికితే సమయం, పెట్రోల్ సేవ్ అవుతుంది.
– సతీశ్, బొంబాయికాలనీ వాసుడు
ప్రజలకు ఉపయోగపడే రీతిలో రైతుబజార్ నిర్మాణం..
ప్రజలకు ఉపయోగపడే విధంగా మోడల్ రైతుబజార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూరగాయలు, మాంసం, పప్పుదినుసులు ఇలా ప్రతి వస్తువు రైతుబజార్లోనే దొరికే విధంగా దేనికిదానికి ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేయిస్తున్నాం. ప్రస్తుతం మంజూరైన రూ.3 కోట్లతో షెడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇతర సౌకర్యాల ఏర్పాటుకు రూ.2 కోట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాం. షెడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యేలోపే మిగతా నిధులను మంజూరు చేయించుకొని పూర్తి సౌకర్యాలతో మోడల్ రైతుబజార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– సింధూఆదర్శ్‌రెడ్డి, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్