పటాన్చెరు టౌన్/ జిన్నారం/గుమ్మడిదల, మే 19: అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర కార్మికశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని భానూరు గ్రామం, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీల పరిధిలో రూ.83కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం భానూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జూన్ 2వ తేదీ నుంచి అర్హలందరికీ పింఛన్లు అందజేస్తామన్నారు.నియోజకవర్గానికి 2500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు రెండో విడత మంజూరు చేస్తామన్నారు. సీఎస్ఆర్ కింద పరిశ్రమలు ఇచ్చే నిధులను ఎక్కడికక్కడ స్థానికంగానే ఖర్చు చేస్తే ఆప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.
గరీబ్ హఠావో పేరుతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు అసైన్డ్ భూములు ఇచ్చారని గుర్తు చేశారు. భానూరు గ్రామస్తుల వినతి మేరకు కర్దనూరు చౌరస్తా నుంచి శంకర్పల్లి వరకు రోడ్డును వందఫీట్లుగా విస్తరిస్తామన్నారు. పటాన్చెరులో నిర్మించిన నూతన దవాఖానకు మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పేరు పెడుతామని హామీ ఇచ్చారు. పటాన్చెరు ఓఆర్ఆర్ నుం చి కంజర్ల వరకు రోడ్డు బాగు చేయాలని ఇంద్రేశం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మం త్రికి వినతి పత్రం అందజేశారు.
ఇంద్రేశం, జిన్నారం మున్సిపల్ కార్మికులకు జీవో 69 ప్రకారం కనీస వేతనం రూ. 16,600 ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వర్రావు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్, అడిషనల్ కలెక్టర్ పాండు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు సుమలత, ప్రమీల, జనార్దన్, కుమార్‌గౌడ్, సుష్మ, సర్పంచ్‌లు శాంతయ్య, విక్రమ్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ వైస్ చైర్మర్లు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.