సంగారెడ్డి, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని రా్రష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గురువారం సంగారెడ్డి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి రాజనర్సింహ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆనవాయితీ ప్రకారం పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9గంటలకు కచ్చితంగా మం త్రులు జాతీయజెండాను ఎగురవేస్తున్నారు.
మంత్రి దామోదర మాత్రం 15 నిమిషాలు ఆలస్యంగా జెండా ఎగురవేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యం, నీటిపారుదల రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఆరు గ్యారెంటీల కోసం 17.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 1.22 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు తెలిపారు. 1.89 లక్షల మంది మహిళలకు రూ.500కు గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నట్లు చెప్పారు. గృహజ్యోతి పథకం ద్వారా 1.03 లక్షల మంది లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు.
రైతు భరోసా పథకం అమలుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 77,861 మంది రైతులకు రూ.564.69 కోట్లు రుణమాఫీ చేసినట్లు వివరించారు. చేయూత పథకం ద్వారా 1.58 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణ పనులు రూ.175 కోట్లతో చేపడుతున్నాముని, త్వరలో పనులు ముగించి అన్ని భవనాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సంగారెడ్డిలో రూ.250 కోట్లతో 500 పడకల దవాఖాన నిర్మిస్తున్నామని, ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. మహిళలకు బ్యాంకురుణాలు, స్త్రీనిధి రుణాలు, వడ్డీలేని రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రూ.168 కోట్లతో సింగూరు కాల్వల లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
రూ.24 కోట్లతో నల్లవాగు ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రూ.50 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్య లు తీసుకుంటున్నట్లు వివరించారు. మంత్రి దామోదర రాజనర్సింహ తన ప్రసంగంలో అంబేద్కర్, నెల్సన్మండేలా మాటలను ఊటంకించారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.