కోహీర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ‘మన ఊరు – మన బడి’తో కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. మొదటి విడుతలో 18 బడులను ఎంపిక చేసిన ప్రభుత్వం తరగతి గదుల నిర్మాణం, తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాల కల్పన కోసం రూ. 2.39 కోట్లు మంజూరు చేసింది. పలుచోట్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సర్కార్ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి బలోపేతం చేస్తూ, దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. నిన్న మొన్నటి అరకొర సౌకర్యాలు, శిథిల భవనాలతో దర్శనమిచ్చిన పాఠశాల భవనాలు, ప్రస్తుతం కార్పొరేట్‌కు దీటుగా సిద్ధమవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోహీర్, అక్టోబర్27: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఎన్నడూలేని విధంగా విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా మనఊరు-మనబడి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్నది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని 18పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2.39కోట్లతో పనులు ప్రారంభించింది.
కోహీర్, దిగ్వాల్, బిలాల్పూర్, గొటిగార్‌పల్లి, గురుజువాడ జడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. బిలాల్పూర్ ప్రాథమిక, గురుజువాడ బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలలు, గొటిగార్‌పల్లి, కవేలి, ఖానాపూర్, పీచెర్యాగడి, మనియార్‌పల్లి, నాగిరెడ్డిపల్లి, మద్రి గ్రామాలతో పాటు కోహీర్‌లోని మూడు ప్రాథమిక పాఠశాలలను గుర్తించారు. మొత్తానికి 13 ప్రాథమిక పాఠశాలలు, 5 జడ్పీ ఉన్నత పాఠశాలలను అందంగా తీర్చిదిద్దే పనుల్లో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. పనులను పర్యవేక్షించేందుకు పలు శాఖల అధికారులకు బాధ్యతలను అప్పగించారు. దీంతో ‘మనఊరు-మనబడి’ పనులు నిరంతరంగా చేపడుతున్నారు.
అందుబాటులో సౌకర్యాలు..
‘మనఊరు-మనబడి’ ద్వారా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆయా పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిలో రెండు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. గాలి కోసం రెండు ఫ్యాన్లను బిగించారు. సంపులను నిర్మించి తాగునీటి వసతిని కల్పించారు. నల్లాల ఏర్పాటుతో వారి తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయాయి. మరుగుదొడ్లను నిర్మించి సంవత్సరాల తరబడి ఉన్న విద్యార్థుల కష్టాలను దూరం చేశారు. పనులు అంత్యదశకు చేరాయి. పాఠశాలల భవనాలకు రంగులు వేయాల్సి ఉంది. వాటిని కూడా త్వరలో పూర్తి చేయనున్నారు.
విద్యార్థుల ఇబ్బందులు తీరినట్లే..
పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పడిన ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ని ప్రవేశపెట్టింది. ఇంతమంచి కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలిగిపోయాయి. విద్యార్థుల అవస్థలు తీర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– శ్రీనివాస్, గురుజువాడ ఎంపీటీసీ
ఇబ్బందులు తీరాయి..
బిలాల్పూర్ ప్రాథమిక పాఠశాల్లో విద్యార్థుల ఇబ్బందులు తీరిపోయాయి. ప్రతీ తరగతి గదిలో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లను ఏర్పాటు చేశారు. ట్యాంకును ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించారు. మరుగుదొడ్లను నిర్మించారు. ఇంతమంచి పనులు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– రాఘవులు, బిలాల్పూర్ హెచ్ఎం
స్కూళ్లు మంచిగ కనిపిస్తున్నాయి..
కోహీర్ మండలంలోని 18 స్కూళ్లను ‘మనఊరు-మనబడి’ కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం రూ.2.39 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో తరగతి గదుల నిర్మాణం, తాగునీరు, లైట్లు, ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. పనులు జరిగిన పాఠశాలలు ఇప్పుడు చాలా మంచిగ కనిపిస్తున్నాయి.
– శంకర్, కోహీర్ మండల విద్యాధికారి