Pawan Kalyan | తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ‘పర్సంటేజ్ విధానం’ అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా, నిర్మాతలు మాత్రం దీనికి వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. చివరకు మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరేలా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అపాయింట్మెంట్ కోరడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ సమయం కేటాయించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా లేఖ రాసింది. ఆయనకు అనుకూలమైన తేదీలో కేవలం 15 నిమిషాల పాటు సమావేశానికి అవకాశం ఇవ్వాలని కోరింది. ఈ భేటీలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జె. చంద్రశేఖర్ రావు, ప్రముఖ నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాల గోవింద్ రాజ్ తదితరులు పాల్గొంటారని లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల తెలంగాణ ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమైన విషయం తెలిసిందే. మరోవైపు మంగళవారం రాత్రి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ను కలిసి పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో వై. రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ వంటి నిర్మాతలు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ల వ్యవస్థ, రెవెన్యూ మోడల్ వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కూడా పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేక సమావేశం కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తారా? ఎగ్జిబిటర్లు-నిర్మాతల మధ్య వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? అనే అంశాలపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.