చేగుంట, అక్టోబర్ 27: ప్రజా రవాణా కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమధ్య రైల్వే కృషి చేస్తుందని దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పీడీ మిశ్రా పేర్కొన్నారు. గురువారం మనోహరాబాద్ నుంచి కామారెడ్డి వరకు సుమారు 68 కిలోమీటర్ల వరకు విద్యుత్ రైలును ప్రారంభించి, నడిపించారు. ఇదే రైలులో వచ్చిన పీడీ మిశ్రా చేగుంటలోని వడియారం రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ సిగ్నల్ పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా సిగ్నల్ వ్యవస్థ తదితర అంశాలను స్టేషన్ మాస్టర్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిశ్రా మాట్లాడుతూ ప్రజా రవాణా కోసం రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. మొదటి దశ మనోహర్బాద్-కామారెడ్డి వరకు, రెండో దశలో కామారెడ్డి-నిజామాబాద్ వరకు విద్యుద్దీకరణ పనులను కొనసాగుతున్నాయని తెలిపారు. ఆయనవెంట సిగ్నలింగ్ డిపార్టుమెంట్ భూపతిసింగ్, పావని, ఏడీఆర్ఎం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.