కోహెడ, నవంబర్ 4: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామం యక్షగానం, నాటకాల ప్రదర్శనలకు పెట్టింది పేరు. వింజపల్లి, చెంచెల్ చెర్వుపల్లి గ్రామాల్లోనూ జానపద కళాకారులు ఉన్నారు. శ్రీరాములపల్లిలో 20మంది కళాకారులు ‘శ్రీరామాంజనేయ భజన మండలి’ పేరుతో భజన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయాలు కాపాడు కోవాలన్నదే తమ ఉద్దేశమని వారు చెబుతున్నా రు. రామాయణం, మహాభారతం, రేణుకా ఎల్ల మ్మ, శివభక్త మార్కండేయ, వీరబ్రహ్మం గారి చరిత్ర నాటకాలు వీరికి కొట్టిన పిండి. శ్రీరామనవమికి రామాయణం, ఎల్లమ్మ జాతరకు ఎల్లమ్మ నాటకం, బ్రహ్మంగారి జన్మదినానికి బ్రహ్మంగారి చరిత్ర, మార్కండేయ జయంతికి శివభక్త మార్కండేయ, మహాభారతం నాటకాలు ప్రదర్శిస్తున్నారు. మిగతా రోజుల్లో మహాభారతం నాటకాలు వేస్తూ కళను కాపాడుతున్నారు.
తిరుపతిలో అఖండ హరినామ స్మరణ
శ్రీరామాంజనేయ భజన మండలి వారి భజనలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుర్తించింది. ఏటా ఆరు నెలలకు ఒకసారి తిరుపతిలోని పద్మావతి ఆలయంలో జరిగే అఖండ హరినామ స్మరణకు వీరు భజనలు చేస్తుంటారు. ఖర్చులు తిరుమల తిరుపతి దేవస్థానం భరిస్తుంది. ఉచితంగా దర్శనం, లడ్డూ ప్రసాదాలు అందిస్తున్నది. అలాగే గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం భజనలు చేస్తారు. ఖర్చులు తలాకొంత వేసుకుంటారు. భక్తులు ఇస్తే భజన మండలి ద్వారా తీసుకుంటారు. కళను, భక్తి చాటుకుంటూ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల మనన్నలు పొందుతున్నారు. భజగోవిందం, గోమాత, దళిత గోవిందం కార్యక్రమాలు చేస్తున్నారు.
లోక కల్యాణమే లక్ష్యం..
మన సంప్రదాయాలు కాపాడేందుకు కృషిచేస్తున్నాం. యక్షగానం, నాటకాలు ప్రదర్శిస్తూ, భజనలు చేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంచుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం సూచనలు పాటిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. సమాజ శ్రేయస్సు కోసం పచ్చదనం, పరిశుభ్రత, కరోనా, డెంగీలను అరికట్టేందుకు మావంతుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. 30 ఏండ్ల నుంచి భజన మండలి కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. దేవుడి కృప, ప్రజల ఆదరాభిమానాలతో మా ప్రయత్నం ఆటంకం లేకుండా సాగుతున్నది.
– వేముల వీరస్వామి, శ్రీరామాంజనేయ భజన మండలి అధ్యక్షుడు,శ్రీరాములపల్లి (సిద్దిపేట జిల్లా)
సామాజిక సేవలు
భక్తి, యక్షగానం, భజనలతో పాటు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు
‘శ్రీరామాంజనేయ భజన మండలి’ కళాకారులు. కరోనా, డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించారు. పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.