జిన్నారం, జూన్ 28 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో హెలీకాప్టర్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. గ్రామ శివారులోని పాలెం వద్ద సర్వే నెం.55లో 22 ఎకారల ప్రభుత్వ భూమిని రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. వాటికి సంబంధించిన పత్రాలను టీఎస్ఐఐసీకి కేటాయించగా, ఆగస్టు మొదటి వారంలో పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేసే అవకాశముంది. రింగురోడ్డుకు కేవలం 15కిలోమీటర్ల దూరంలోనే మంగంపేట గ్రామం ఉంది. ఈ గ్రామానికి మెరుగైన రవాణ సౌకర్యం ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తున్నది. మండల కేంద్రం జిన్నారం నుంచి నలువైపులా ఉన్న సింగిల్ రోడ్లను తెలంగాణ ప్రభుత్వం డబుల్ రోడ్లుగా విస్తరించింది. హైదరాబాద్ మహానగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరం, రింగురోడ్డుకు 15 కిలోమీటర్ల దూరం ఉన్న మంగంపేట గ్రామంలో హెలీకాప్టర్ విడి భాగాల పరిశ్రమ ఏర్పాటు కానుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 800 జనాభా, వంద కుటుంబాలు ఉన్న ఈ చిన్న పంచాయతీ వార్షిక ఆదాయం సుమారు రూ.70వేలు. గ్రామస్తులు వ్యవసాయం ఆధారంగానే జీవిస్తున్నారు. కొందరు బొంతపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడలో కార్మికులుగా పని చేస్తున్నారు. మరికొందరు స్వయం ఉపాధి ద్వారా జీవనం వెళ్లదీస్తున్నారు. మంగంపేట శివారులోని పాలెంలో హెలీకాప్టర్ విడి భాగాల పరిశ్రమ ఏర్పాటుకానుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న తమకు పరిశ్రమ ఏర్పాటుతో చదువుకున్న వారికి, గ్రామస్తులకు ఉపాధి లభిస్తుందని ఆనందిస్తున్నారు.
సమీపంలో రింగురోడ్డు, విశాలమైన రోడ్లు..
జిన్నారం మండలానికి రింగురోడ్డు సమీపంలోనే ఉండడంతో పలు సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. మెరుగైన రవాణ సౌకర్యం, విశాలమైన రెండు వరుసల రోడ్లతో మండల కేంద్రం నుంచి నాలుగువైపులా రహదారులను ప్రభుత్వం విస్తరించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లను విస్తరించడంతో జిన్నారం మండలంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. శివనగర్ గ్రామంలోని సర్వేనంబర్ 114లో 120 ఎకరాలలో ఎల్ఈడీ బల్బుల విడిభాగాలను తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. అలాగే మండల కేంద్రం జిన్నారంలోని సర్వే నెం.1లో సుమారు వంద ఎకరాలను టీఎస్ఐఐసీకి కేటాయించారు. ఇక్కడ ఇంజినీరింగ్ పరిశ్రమలు ఏర్పాటుకానున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రహదారులు విస్తరించడం, జిన్నారం మండలంలో నూతన పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు రావడం ప్రత్యేక రాష్ట్ర ఫలాలేనని ప్రజలు అంటున్నారు.
స్థానికులకు అవకాశాలు..
మా గ్రామంలో హెలీకాప్టర్ విడి భాగాల పరిశ్రమ ఏర్పాటుకానుండడం సంతోషంగా ఉంది. పరిశ్రమ ఏర్పాటుతో విద్యావంతులకు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్రామానికి రాకపోకలు పెరుగుతాయి. మా గ్రామస్తులకే కాకుండా విద్యావంతులైన ఇతరులకు ఉపాధి లభిస్తుంది. మంగంపేటలో కూడా పరిశ్రమ ఏర్పాటు కావడం మా అదృష్టం.
మరిన్ని పరిశ్రమలు రావాలి..
తమ గ్రామంలో హెలీకాప్టర్ విడిభాగాల పరిశ్రమ ఏర్పాటుకు భూములు కేటాయించడం సంతోషం. పరిశ్రమ ఏర్పాటును గ్రామస్తులందరం స్వాగతిస్తున్నాం. పనులు త్వరలోనే మొదలై, పరిశ్రమ ప్రారంభమయితే, మా గ్రామస్తులకు ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయి.