సంగారెడ్డి సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆచరణాత్మక వ్యవసాయ విద్యను నేర్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ‘స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్’ ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కేంద్ర వ్యవసాయశాఖ చేపట్టింది. సంగారెడ్డి జిల్లాలోని కొత్లాపూర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది.
కొత్లాపూర్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 7,8,9, 10వ తరగతుల్లో ఎంపిక చేసిన విద్యార్థులు సొంత గ్రామంలో మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్షల నిర్వహణ, సాయిల్ హెల్త్‌కార్డుల తయారీ చేపట్టనున్నారు. ఇందుకోసం సంగారెడ్డిలోని వ్యవసాయశాస్త్రవేత్తలు, సాయిల్ టెస్టు లేబొరేటరీ అధికారులు మంగళవారం కొత్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్‌పై అవగాహన కల్పించారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్, వ్యవసాయశాస్త్రవేతలు డాక్టర్ రాహుల్, డాక్టర్ వరప్రసాద్, సాయిల్ టెస్టు లేబొరేటరీ ఏడీఏ అంబికాసోనీ సాయిల్ హెల్త్, మట్టి నమూనా పరీక్షల ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. మట్టి పరీక్షల నిర్వహణకు త్వరలోనే ప్రత్యేక కిట్లు అందజేయడంతోపాటు సాయిల్ హెల్త్రిపోర్టుల తయా రు కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ యాప్‌ను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు అంబికాసోనీ, వెంకటలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.