జహీరాబాద్, ఏప్రిల్ 27: కనుమరుగవుతున్న చిరుధాన్యాలను సాగు చేస్తూ వాటిని సంరక్షించడంలో జహీరాబాద్ డీడీఎస్ సొసైటీ మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న కృషి ఎనలేనిదని రాష్ట్ర సుస్థిర వ్యవసాయ శిక్షణ కేంద్రం ప్రధాన విత్తన శాస్త్రవేత్త గౌరీశంకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని పస్తాపూర్లోని డీడీఎస్ కార్యాలయ ఆవరణలో సోమవారం అంతర్జాతీయ విత్తన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా డీడీఎస్ కార్యాలయ ఆవరణలో విత్తన సంరక్షకుల సమావేశం నిర్వహించారు. అనంతరం డీడీఎస్ సొసైటీ పరిధిలోని 45 గ్రామాలకు చెందిన 100 మంది విత్తన సంరక్షకులు 70కిపైగా దేశీ విత్తనాలు ప్రదర్శించారు.
ఇందులో అంతరించిపోతున్న అత్తాకోడళ్ల జొన్నలు, నల్లతొగరి, బుర్క తొగరి, తెల్ల శనగలు, నల్ల కొబ్బరి వంటి అరుదైన విత్తనాల ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం అంతరించిపోతున్న పూర్వ వ్యవసాయ పద్ధతులు మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కనుమరుగవుతున్న చిరుధాన్యాలను కాపాడుతున్న డీడీఎస్ మహిళా సంఘాల కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న తిండి గింజలతో అనారోగ్యాలకు గురికావాల్సిన పరిస్థితి ఉందన్నారు. విత్తన అభివృద్ధి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య మాట్లాడుతూ డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు సాగు చేస్తున్న చిరుధాన్యాలు తినడంతో అరోగ్యాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
డీడీఎస్-కేవీకే కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు కనుమరుగవుతున్న చిరుధాన్యాలను కాపాడుతూ, పంటల సాగు చేస్తున్న కృషిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. అనంతరం డీడీఎస్ పరిధిలోని గ్రామాలకు చెందిన మహిళా రైతులు ప్రదర్శించిన విత్తనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకోవడంపై వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీడీఎస్ ఎగ్జిక్యూటీవ్ డెరెక్టర్ దివ్య, జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ సంచాలకుడు భిక్షపతి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, డీడీఎస్ పొసైటీ మహిళా సంఘాల సభ్యులు, మహిళ రైతులు పాల్గొన్నారు.