హత్నూర, మే 15: పరిశ్రమలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలపై సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్నూర మండలం బోర్పట్ల శివారులోని ఎపిటోరియా పరిశ్రమ, నూతనంగా నిర్మిస్తున్న తెరనీయం బయాలోజి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలపై స్థానికులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీపీవో సాయిబాబా, నీటిపారుదల ఎస్ఈ ఏసయ్య, పీసీబీ ఈఈ గీత గురువారం పరిశ్రమను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో బోర్పట్ల గ్రామస్తులు ఎపిటోరియా పరిశ్రమతో ఎదురవుతున్న ఇబ్బందులు, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. పరిశ్రమలో నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం తెలియదా అని పరిశ్రమ ప్రతినిధులను హెచ్చరించారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై మూడు నోటీసులు ఇచ్చినా సంజాయిషీ ఇవ్వకపోగా యథేచ్చగా నిర్మాణాలు కొనసాగించడంపై ప్రశ్నించారు.
ఎత్తిపోతల పథకం పైప్లైన్ ధ్వంసం చేయడంపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. కాలుష్య జలాలతో ఇబ్బందులు పడుతున్నామని పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తే శాంపిల్స్ సేకరించి వెళ్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అధికారులతో మొరపెట్టుకున్నారు. కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటే చర్యలు తీసుకోవాలని పీసీబీ ఈఈని అదనపు కలెక్టర్ ఆదేశించారు. చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎస్ఈ ఏసయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీవో యూసూఫ్, డీటీ దావూద్, కార్యదర్శి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.