చేర్యాల, జనవరి 11: ప్రజల ఆర్థ్ధిక స్థితిగతులు గతంలో పోలిస్తే ప్రస్తుతం పెరిగాయని, 20, 30 ఏండ్లుగా ఎంతో కష్టపడితే అది సాధ్యమైందని, ఇప్పుడు పెరిగిన ఆర్థిక స్థ్ధితిని చూసి ఈ జనరేషన్‌కు కష్టం విలువ తెలియకుండా పెంచరాదని తెలంగాణ హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి బి.విజయసేన్‌రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ఫస్ట్‌క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు, అంతస్తులు కాదని మంచి విద్య, క్రమశిక్షణ అందించాలన్నారు.
ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలన్నారు. కోర్టు ప్రారంభంతో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు తాము బాధ్యతగా చేర్యాల జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాయర్ వృత్తి చాలా స్వేచ్ఛతో కూడుకున్నదని, ప్రజలకు మంచి జరగాలంటే లాయర్లు ఉత్సహంతో పనిచేసి కోర్టుల ద్వారా ప్రజలకు కాలయాపన కాకుండా న్యాయసేవలు అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
కోర్టు కేసుల పరిష్కారంలో నూతన టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ న్యాయ వ్యవస్ధలో కీలక పాత్ర పోషించనుందన్నారు. సీనియర్ లాయర్లు జూనియర్ లాయర్లకు అవకాశాలు కల్పించి, వారు వృత్తిపరంగా ఎదిగేందుకు ప్రోత్సహించాలని సూచించారు. కోర్టు ప్రారంభానికి పెద్దసంఖ్యలో వచ్చిన మిమ్మల్ని చూస్తేనే ఈ ప్రాంతంలో కోర్టు ఏర్పాటు ఎంత అవసరమో తెలుస్తుందని హైకోర్టు జడ్జి బి.విజయసేన్‌రెడ్డి అన్నారు.
అనంతరం జిల్లా ప్రిన్సిపాల్ అండ్ సెషన్స్ జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థకు ప్రముఖ స్థ్ధానం ఉందని, చేర్యాలలో కోర్టు ఏర్పాటుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత పౌరులకు సత్వర న్యాయసేవలు అందించేందుకు కోర్టు ఏర్పాటు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇన్చార్జి కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు ఈ కోర్టు ఏర్పాటు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.
జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. చేర్యాలలో కోర్టు ఏర్పాటు 20 ఏండ్ల కలని, ఇప్పుడు అది నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మీ హైకోర్టు జడ్జి, జిల్లా జడ్జిని పూలబొకేలు అందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా జడ్జి, సిద్దిపేట, జనగామ, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.
– జిల్లా జడ్జి సాయి రమాదేవి