Chilipiched | చిలిపిచెడ్, ఆగస్టు 16: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన రైతులు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను పాటించాలని మండల వ్యవసాయ అధికారి వెంకట రాజశేఖర్ గౌడ్ తెలిపారు. వరి, పత్తి వంటి పంట పొలాల నుండి నీరు నిలిచి ఉన్నట్లయితే, త్వరగా బయటకు పంపేందుకు మురుగునీటి కాలువలను ఏర్పాటు చేయాలని. ఎరువుల వాడకం, పైపాటుగా వేసే ఎరువులు, మరియు పురుగు మందుల పిచికారిని తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారి చెప్పుకోచ్చాడు.
ఇక పంటల వారీగా సూచనలు చూసుకుంటే:
వరి: నీటిలో మునిగిన పొలాల నుండి నీటిని త్వరగా బయటకు పంపాలి. ఇంకా నాట్లు వేయని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత నాట్లు వేయడానికి సిద్ధం కావాలి. సమయం తక్కువగా ఉన్నట్లయితే, వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేయాలి. కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి. పంట త్వరగా కోలుకోవడానికి, లీటరు నీటికి 5 గ్రాముల 19.19.19 ద్రావణాన్ని లేదా 2 మి.లీ. నానో యూరియా లేదా నానో డీఏపీని పిచికారీ చేయాలి.
పత్తి: అధిక వర్షాల కారణంగా పత్తి పంటకు వడలు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు, లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి మొక్కల మొదళ్లలో బాగా తడిచేలా పిచికారీ చేయాలి. ఈ ప్రక్రియను వారంలో రెండుసార్లు చేయాలి. పంట త్వరగా కోలుకోవడానికి లీటరు నీటికి 5-10 గ్రాముల మల్టీ-కే లేదా 10 గ్రాముల యూరియా లేదా 2 మి.లీ. నానో యూరియాను పిచికారీ చేయాలి.
మొక్కజొన్న: పొలంలో నీరు నిలిచి ఉన్నట్లయితే వెంటనే బయటకు పంపే చర్యలు తీసుకోవాలి. భాస్వరం లోపం నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. నానో డీఏపీ లేదా 5 గ్రాముల 19.19.19 పోషకాన్ని పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత పొలంలో అంతర కృషి చేయడం వల్ల కలుపు మొక్కలను తొలగించడంతో పాటుగా, పొలంలో అధిక తేమను తగ్గించుకోవచ్చని వ్యవసాయ అధికారి సూచించారు.